నిజామాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పేవన్నీ అబద్ధాలేనని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయంలో అసత్య ఆరోపణలు చేసిన అర్వింద్‌పై మండిపడ్డారు. జిల్లా మంత్రిగా పలు ఆర్వోబీల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపానని, దమ్ముంటే వాటిని మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో రూ.7 కోట్లతో పదివేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదామును గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన భీమ్‌గల్ మండలం బెజ్జోరలో మీడియాతో మాట్లాడారు. అబద్ధ్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనే ఆలోచనే తప్ప ప్రజలకు మేలు చేసే జ్ఞానం ఎంపీ అర్వింద్‌కు లేదని మండిపడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) విషయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తాను చేయని కృషి లేదని చెప్పారు. నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద నిర్మిస్తున్న ఆర్వోబీ ఈ ప్రాంత ప్రజల మూడున్నర దశాబ్దాల కోరిక అని తెలిపారు.
ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించి రూ.63 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. మొత్తం రూ.93 కోట్ల ఆర్వోబీ పనుల్లో కేంద్రం వాటా రూ.30 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టాల్సిన పనులు రెండు నెలలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్రం చేయాల్సిన పనులేవీ ఇంకా ప్రారంభించలేదని ఆరోపించారు. జిల్లాలో అర్సపల్లి, నవీపేట, బోధన్, ఇందల్వాయి వద్ద ఆర్వోబీల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌తోపాటు రైల్వే బోర్డుకు రాసిన లేఖలను మీడియాకు చూపించారు.
ఏడాది కాలంలో నాలుగు సార్లు లేఖలు రాసి ఒత్తిడి చేయడం ద్వారానే అర్సపల్లి ఆర్వోబీ మంజూరైందని తెలిపారు. దమ్ముంటే మిగిలిన ఆర్వోబీలను అర్వింద్ తీసుకురావాలని మంత్రి సవాల్ విసిరారు. అర్వింద్ అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఎంపీగా గెలిచి నాలుగేండ్లయినా కేంద్రం నుంచి పైసా కూడా తేలేదని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచాననే స్పృహను మర్చిపోయి దేవుళ్ల పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేసేటోళ్లు ఎవరు? తిట్టేటోళ్లు ఎవరో ప్రజలు గుర్తించాలని అన్నారు. తిట్టేటోళ్లను దూరం పెట్టి.. అభివృద్ధి చేస్తున్న వాళ్లను ఆదరించాలని కోరారు.
పీఎంఆర్ఎఫ్ ఒక్కరికైనా ఇప్పించావా?
ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రైవేటు దవాఖానల్లో వైద్య ఖర్చుల నిమిత్తం పీఎం సహాయ నిధి ద్వారా ఒక్కరికైనా సాయం చేశావా? అని అర్వింద్‌ను మంత్రి వేముల ప్రశ్నించారు. ఆపదలో ఉన్న వందలాది మందికి సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారని చెప్పారు. అర్వింద్ కూడా పీఎంఆర్ఎఫ్ ద్వారా నిజామాబాద్ ప్రజలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
సీఎంఆర్ఎఫ్ కింద ఒక్క బెజ్జోర గ్రామంలోనే 46 మందికి రూ.23 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు గుర్తుచేశారు. అర్వింద్ ఎంత మందికి ఎన్ని లక్షలు ఇప్పించాడని ప్రశ్నించారు. అర్వింద్‌ను ఎంపీగా గెలిపించడం వల్ల జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు చేయకుండా అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.