చివ్వెంల, జనవరి 10 : సూర్యాపేట జిల్లాలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం చెందగా, 18 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాలోని కలహంది కోరాపూట్ జిల్లా బీసింగ్పూర్ తాలూకాకు చెందిన 32 మంది వలస కూలీలు ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు బయల్దేరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం శివారులోకి రాగానే ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆంగోతుతండా వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు హైదరాబాద్కు తరలిస్తుండగా చనిపోయారు. 18 మంది గాయపడ్డారు. మృతులు రూపు హరిజన్(51), సుల హరిజన్ (46), సునామణి హరిజన్ (61), ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17), బస్సు డ్రైవర్ సునీల్ గోర్డా(37)గా గుర్తించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు.