ములుగు : ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు పెళ్లిచూపులకు నర్సంపేటకు వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో గట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మృతులను వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన రమేశ్(48), శ్రీను(45), సుజాత(40), డ్రైవర్ కళ్యాణ్(26)గా పోలీసులు గుర్తించారు.