వినాయక్‌నగర్, నవంబర్ 8: తన కుమారుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ బూటకమని, పట్టుకొని దారుణంగా చంపేశారని అతడి తల్లి జరీనాబేగం ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్‌తోపాటు జాతీయ బాలల హక్కుల కమిషన్, జాతీయ మహిళా హక్కుల కమిషన్లను ఆశ్రయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రియాజ్ హత్యతోపాటు తమ కుటుంబంపై జరిగిన పోలీసుల అమానుష దాడి ఘటనను సుమోటోగా స్వీకరించాలని ఆమె కమిషన్ ముందు బోరున విలపించారు. తన కుటుంబాన్ని పోలీసులు హింసిస్తున్నారని తన కుమారుడు రియాజ్ స్వయంగా లొంగిపోయాడని, అనంతరం పోలీసులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలకు గురిచేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడి మెడ విరిచేశారని, పొట్ట భాగంలోంచి పేగులు బయటకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్ ప్రమోద్ను తన కుమారుడు రియాజ్ హత్య చేయలేదన్న అనుమానం వ్యక్తంచేసిన ఆమె.. ప్రమోద్ హత్యపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన కొడుకే కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి ఉంటే ఆధారాలు చూపించాలని కోరారు. తన కుమారుడి అంతిమ యాత్ర చేస్తుంటే పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారని రియాజ్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటే అక్కడ చేయకూడదని వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరి కొడుకుకైనా ఇలాంటి పరిస్థితి రాకూడదని కంటతడి పెట్టుకున్నారు. తన కుమారుడు పోలీసు కస్టడీలోనే చనిపోయాడని, రియాజ్ చనిపోయాక అతడ్ని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి అక్కడ ఖైదీల రూం 407లో పెట్టారని, 4వ ఫ్లోర్లో ఉన్న రోగులు అందరినీ ఖాళీ చేయించారని జరీనాబేగం ఆరోపించారు.
రియాజ్ చేతులు కట్టేసి ఉన్నాయని, మెడ విరిగి పోయిందని, శరీరం మీద తీవ్ర గాయాలు ఉన్నాయని, అలాంటి వాడు పోలీసులను ఎదిరించి గన్ ఎలా లాక్కుంటాడని ఆమె ప్రశ్నించారు. తన కుమారుడిపై ఆరోపణలు చేసిన పోలీసులు.. ఉన్నతాధికారుల సమక్షంలో మూడు బుల్లెట్లను కాల్చారని అన్నారు. రియాజ్ కస్టడీలో బతికే ఉంటే దవాఖానకు తీసుకెళ్లినప్పుడు నడుచుకుంటో లేక వీల్ చైర్లోనే తీసుకెళ్తారు కదా? అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. మృతదేహం చూశాక ముక్కు విరిగిపోయి ఉన్నదని, మెడ ఊగిపోతున్నదని, పెదాలు పగిలిపోయి ఉన్నాయని తెలిపారు. తన కుమారుడి ఘటనపై సీబీఐ విచారణ వేసి నిజానిజాలు బయటకు తేవాలని కోరారు.
తన కుటుంబంపై ఇప్పటికీ వేధింపులు జరుగుతున్నాయని, చిన్న పిల్లలను రోడ్ల మీద వేధిస్తున్నారని, వాళ్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడి హత్యలో ఆసిఫ్ పాత్ర ఉన్నదని, అతనిపైనా విచారణ జరిపించాలని జరీనాబేగం డిమాండ్ చేశారు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదని, తన కుమారుడి బూటకపు ఎన్కౌంటర్లో కొంతమంది పోలీసుల కుట్ర ఉన్నదని ఆమె ఆరోపించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణ చేయలేదని, అందుకే జాతీయ స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలని కోరేందుకు ఇక్కడి వరకు వచ్చినట్టు ఆమె తెలిపారు. తన కుమారుడు షేక్ రియాజ్ హత్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్, జాతీయ మహిళా హక్కుల కమిషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్టు రియాజ్ తల్లి తెలిపారు.