లక్షన్నర కోట్లు!.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్‌ఫ్రంట్‌కు ఈ స్థాయిలో బడ్జెట్‌ను ఏ దేశమూ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ, మూసీ రివర్‌ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతున్నది. చేదునిజం ఏమిటంటే.. దేశంలో చేపట్టిన రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి. లక్షన్నర కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం.. ఇప్పుడు ఆ నిధులను కాంగ్రెస్ సర్కారు నీటిపాలు చేయబోతున్నదా?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మూసీని సుందరీకరిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. వ్యర్థాలతో కంపుకొడుతున్న ఏ నదినైనా ప్రక్షాళన చేయాలంటే ముందుగా శాస్త్రీయపరమైన అధ్యయనం ఎంతైనా అవసరం. అంటే నదీ ప్రవాహం తీవ్రత, కాలుష్యం జరుగుతున్న తీరు, నదిఒడ్డున నిర్మాణాలు ఇలా ప్రతీ అంశంపై లోతైన అవగాహన ఉండాలి. అలాగే, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టడానికంటే ముందే సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థను ప్రారంభించాలి.
ఇలాంటి కీలకాంశాలను పట్టించుకోకుండా ఆర్భాటంగా ప్రారంభించిన పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ విఫల ప్రయత్నాలుగానే మిగిలాయి. ఈ క్రమంలో ఎలాంటి పటిష్ట కార్యాచరణలేకుండా బడుగుల ఇండ్లను కూలగొట్టడంతోనే మూసీ అభివృద్ధి జరుగుతుందన్నట్టు రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చేరి
ఐరోపాలోని పోలండ్‌లో చారిత్రక నిర్మాణాలకు, సంస్కృతీ సాంప్రదాయాలకు క్రాకో నగరం పెట్టిందిపేరు. ప్రపంచవారసత్వ నగరంగా 1978లోనే ఈ నగరం యునెస్కో గుర్తింపు పొందింది. అయితే, నగరంగుండా ప్రవహించే విస్తులా నది కాలుష్యానికి చిరునామాగా మారడం, వాయుకాలుష్యంతో చారిత్రాత్మక కట్టడాలు ధ్వంసమవ్వడం ప్రారంభమైంది. టూరిస్టుల సంఖ్య కూడా తగ్గుముఖంపట్టింది. దీంతో విస్తులా రివర్ ఫ్రంట్ పేరిట రూ. 1,700 కోట్లతో నీటి శుద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించారు.
అయితే, స్థానిక యంత్రాం గం కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కుమ్మక్కై ఆ ప్రాజెక్టును అటకెక్కించాయి. సీవరేజ్ ట్రీట్మెంట్ నిర్వహణకు అవసరమైన ట్యాంకుల నిర్మాణానికి తగిన జాగా లేదని ప్రభుత్వాధికారులు చేతులు దులుపుకొన్నారు. అయితే, ప్రాజెక్టుకు కేటాయించి నిధులు ఏమయ్యాయో మాత్రం తెలియలేదు.
Ravi River
జీవితకాలం లేటు
ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం కావాలంటే.. ఏడాది, ఐదేండ్లు, పదేండ్ల వరకూ సమయం పట్టొచ్చు. అయితే, 77 ఏండ్ల కిందట ప్రతిపాదించిన ఓ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కలేదంటే నమ్మగలమా? పాకిస్థాన్ ఇందుకు వేదికగా నిలిచింది. భారత్ నుంచి విడిపోయిన 1947లో రావి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును అప్పటి పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అలా దాదాపు 73 ఏండ్లు వాయిదాపడుతున్న ఈ ప్రాజెక్టును 2020లో ఎట్టకేలకు మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు.
రావి రివర్ ఫ్రంట్‌కు రూ. 2.5 లక్షల కోట్ల మేర నిధులు అవసరంఅవుతాయని అంచనావేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయకుండానే నది ఒడ్డున నివాసం ఉంటున్న 1.5 కోట్ల మందిని వేరే ప్రాంతాలకు తరలించారు. ఇండ్లు, ఇతరత్రా నిర్మాణాలను కూల్చేశారు. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ముందస్తు ప్రణాళిక, చిత్తశుద్ధిలేమితోనే ఫిన్లాండ్లోని పొర్వూ రివర్‌ఫ్రంట్, జర్మనీలోని నార్త్ రైన్ రివర్‌ఫ్రంట్, ఆస్ట్రేలియాలోని టోరెన్స్ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులు విఫలప్రయత్నాలుగానే మిగిలిపోయాయి.