హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి ప్రచారంపై ఉన్న శ్రద్ధ, సమస్యల పరిష్కారంపై ఉండదనే విమర్శను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మరోసారి నిజం చేస్తున్నది. రెండు నెలలుగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూతపడితే పట్టించుకోని ప్రధాని, ఇప్పుడేమో జాతికి అంకితం పేరుతో హడావిడి చేస్తున్నారు. నిరుడు మార్చిలో పునఃప్రారంభమైన ఫ్యాక్టరీ నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమై తరచూ ఉత్పత్తి నిలిచిపోతున్నది. సెప్టెంబర్ 7న మూతపడ్డ ఫ్యాక్టరీ సోమవారమే తిరిగి తెరుచుకొన్నది. 12న మోదీ వస్తున్నందున అధికారులు హడావిడిగా మరమ్మతులు చేసి ఉత్పత్తిని ప్రారంభించినట్టు తెలిసింది. లేకుంటే మరిన్ని రోజులు ఫ్యాక్టరీ మూతపడేదని సమాచారం. 60 రోజులుగా 1.8 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి ఆగిపోవటంతో నాలుగు రాష్ర్టాలకు ఎరువుల సరఫరా నిలిచిపోయింది. ఇది రైతులపై, వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇవేవి పట్టించుకోని మోదీ రాజకీయ లబ్ధి కోసం ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమై తరుచూ రిపేర్లకు గురవుతున్న ఫ్యాక్టరీ కొత్తగా జాతికి అంకితం చేస్తానని బయలుదేరుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఫ్యాక్టరీ నిర్వహణ కేంద్రం చేతిలో ఉన్నది. మరమ్మతులు చేయాలని కోరినా కేంద్రం నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదని తెలిసింది. దీంతో అధికారులే నానాకష్టాలు పడి సమస్య పరిష్కరించుకుంటున్నారు.