హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. రోజుల తరబడి తర్జనభర్జనలు చేస్తున్నా ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆమె తన డిమాండ్‌ను బయటపెట్టారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన వెన్నెల.. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై తాను కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా..? అని చాలా మంది అడుగుతున్నారని, అందుకే వాళ్లందరికీ, నాకు, కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ కోసం తాను ఈ ప్రెస్‌మీట్ పెట్టానని వెన్నెల చెప్పారు. తమ కుటుంబం ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా లేదని ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని, తాను పోటీకి సిద్ధమని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చానన్నారు.
తాను కంటోన్మెంట్లో పుట్టి పెరిగానని, అక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెన్నెల చెప్పారు. గద్దర్ కుమార్తెగా ప్రజల ముందుకు వెళ్తున్నానని అన్నారు. ఓట్ల విప్లవం రావాలని తన తండ్రి గద్దర్ అనేవారని, అందుకోసం చివరగా ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. వాస్తవానికి తన తండ్రే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారని, కానీ దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందారని వెన్నెల ఆవేదన వ్యక్తం చేశారు.
నా కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి: గద్దర్ భార్య విమల
గద్దర్ భార్య విమల గద్దర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు టికెట్ ఇస్తామని చెప్పారని, కానీ వారి నుంచి ఇప్పిటికీ ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అందుకే తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తాను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నానని ఆమె చెప్పారు. వెన్నెలకు టికెట్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.