హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్ పటేల్, పల్లె రవికుమార్, కిశోర్గౌడ్తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు పాలమూరు వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డికి ఉద్యమం గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట ఎవరూ వినడం లేదని ఆరోపించారు.
అందుకే మంత్రులు తన కుర్చీపై కన్నేశారని, ఐఏఎస్‌లు సరిగా పనిచేయడం లేదని ఆయనే ఒప్పుకున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును చర్చకు రావాలని, తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానిని రేవంత్‌రెడ్డి సవాల్ విసురుతున్నారని, ఆయన ముక్కు ఊడటం ఖాయమని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కల్పనపై రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. అవినీతి సంపాదనలో రేవంత్‌రెడ్డి మునిగి తేలుతున్నారని ఆరోపించారు.
100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఐదేండ్ల సమయం ఉన్నదంటూ తీరిగ్గా చెప్పడం ప్రజలను మోసగించడమేనని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని పల్లె రవికుమార్ విమర్శించారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ వైఎస్ మంత్రి వర్గం నుంచి బీఆర్ఎస్ బయటకు వస్తే కాంగ్రెస్ నేతలు పదవులు పట్టుకొని వేలాడరని విమర్శించారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారిన పడేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను విమర్శించే అర్హత రేవంత్‌రెడ్డికి లేనే లేదని స్పష్టంచేశారు. బీసీ కులగణనపై సీఎం మొండి వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన లోపాలపై శాస్త్రీయ ఆధారాలతో మాట్లాడుతుంటే రేవంత్ జీర్ణించులేకపోతున్నారని చెప్పారు.