హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, డిసెంబర్ 25: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో విలువైన కాందిశీకుల భూములపై అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తున్నది. కొందరు వ్యక్తులు ఈ భూములు తమవేనంటారు.. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ఏకంగా ఆ భూముల్లో రోడ్డు నిర్మాణం చేపడుతుంది.. ఇదంతా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం ఆదమరుస్తారు. అసలు ఆ భూములతో తమకు సంబంధమే లేదన్నట్టు వ్యవహరిస్తారు. చివరకు ‘నమస్తే తెలంగాణ’ ఈ కబ్జా కాండను వెలుగులోకి తీసుకొనిరావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మూడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఈ విలువైన భూములను సర్వే చేసి కాపాడాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇంతకీ కాందిశీకుల భూముల కథ కంచికి చేరుతుందా? సర్వేలతోనే అటకెక్కుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకు కారణం.. అసలు కాందిశీకుల భూముల లెక్కపై అధికారులే స్పష్టమైన వివరాలు వెల్లడించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బడాబాబులు తిష్టవేసిన ఈ భూముల గుట్టును తేల్చి వాటిని స్వాధీనం చేసుకునేదాకా అధికారులు అడుగులు వేస్తారా? అనేది తేలాల్సి ఉన్నది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పరిధిలో కాందిశీకుల భూములున్నాయి. సర్వే నంబర్ 300లోని భూమిపై న్యాయస్థానంలో కేసు పెండింగులో ఉన్నది. కొందరు వ్యక్తులు ఆ భూములు తమవేనని వాదిస్తుండగా.. అవి కాందిశీకుల భూములైనందున ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో ఆ సర్వే నంబర్లోని భూమిపై వివాదం కొనసాగుతున్నది. అయినప్పటికీ ఓ నిర్మాణ రంగ సంస్థ యథేచ్ఛగా రహదారి నిర్మించుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నది. అంతటితో ఆగకుండా అంతర్గత రహదారి తమదేనంటూ అర్ధరాత్రి దాదాపు వంద కోట్ల విలువైన భూమిని బౌన్సర్లతో కలిసి ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నది.
ఈ విషయాన్ని ‘కాందిశీకుల భూముల్లో… అర్ధరాత్రి ఆక్రమణ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ గురువారం వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం గురువారం ఆ భూములపై దృష్టిసారించింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఈ ఆక్రమణపై సీరియస్ అయ్యారు. కాందిశీకుల భూములా?, పట్టా భూములా? అనే అంశంపై ఎలాంటి స్పష్టత రాకముందే వివాదాస్పద భూమిలో అర్ధరాత్రి కబ్జాలపర్వం ఎలా కొనసాగుతుందని గండిపేట రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఈ మేరకు హుటాహుటిన తరలివచ్చిన అడిషనల్ కలెక్టర్ పుప్పాలగూడ-కోకాపేట గ్రామాల సరిహద్దుల్లోని భూములను పరిశీలించారు.
కలెక్టర్ ఆదేశానుసారం రంగారెడ్డి జేసీ.. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు, నార్సింగి పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, వివిధశాఖల అధికారులు, భూ బాధితులతో కలిసి భూములను పరిశీలించారు. కాందిశీకుల భూమిగా పరిగణిస్తున్న సర్వే నంబర్ 300లో రేకులషెడ్ల తొలగింపు, రహదారి నిర్మాణాన్ని చూశారు. ఈ భూములు ఎవరి పేరిట ఎంత విస్తీర్ణం ఉన్నది? ఏ ఆదేశాల మేరకు కేటాయింపులు జరిగాయి? అనే వివరాలను స్థానిక తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అసలు గండిపేట రెవెన్యూ మండల పరిధిలో కాందిశీకులకు సంబంధించిన భూమి విస్తీర్ణం ఎంత? అందులో ప్రొసీడింగ్స్ పేరిట కేటాయింపులు ఎన్ని ఎకరాలు అమలుచేశారు? అని ఆరా తీశారు.
కాందిశీకులకు చెందిన భూములుగా నిర్ధారించిన సర్వే నంబర్లలో ఎందుకు బోర్డులను ఏర్పాటుచేయలేదని ప్రశ్నించారు. వెంటనే వాటిని ఏర్పాటుచేయాలని సూచించారు. వివాదాస్పదంగా మారిన పుప్పాలగూడ గ్రామ సర్వే నంబర్ 300, కోకాపేట గ్రామ సర్వే నంబర్ 90, వట్టినాగులపల్లి… ఈ మూడు గ్రామాల సరిహద్దులను సర్వే చేయాలని సూచించారు. సదరు నిర్మాణ రంగ సంస్థ హెచ్ఎండీఏ ద్వారా పొందిన అనుమతుల్లో ఏ సర్వే నంబర్ల మీదుగా రహదారి చూపి అనుమతులు పొందిందో స్పష్టంగా నివేదిక తయారుచేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
కాందిశీకుల భూముల్లో ఏ ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతున్నారు? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. విలువైన ఈ భూముల్లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయంటూ అక్కడే ఉన్న భూ బాధితులు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. వాటికి కస్టోడియన్ ఎన్వోసీలు ఇచ్చారా? లేక గుడ్డిగా నిర్మాణాలు జరుపుతున్నారా?అంటూ అధికారులను ప్రశ్నించారు. విలువైన భూముల పరిరక్షణ కోసం అన్నీ సర్వే నంబర్లు, రికార్డుల వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి, ఆక్రమణకు గురైన భూములను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టంచేశారు.
బడాబాబులు తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని పుప్పాలగూడ భూబాధితులు అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని వేడుకున్నారు. నాగుల కుటుంబానికి చెందిన 13.1 ఎకరాల భూమి నుంచి 12.10 ఎకరాల భూమిని విక్రయించే సమయంలో సేల్‌డీడ్‌లో తప్పుగా రహదారి అని పడిందని, దీంతో తమను వేధిస్తున్నారని బోరుమన్నారు. తమకు చదువు రాదని, ఆ భూమి తమ కుటుంబానికి చెందినదని వాపోయారు. కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తీసుకొచ్చినా కొనుగోలుదారుడు తమను వేధిస్తున్నాడని చెప్పారు. ఆ భూమి రహదారికి చెందినదంటూ రికార్డులు తారుమారు చేసి 20 ఏండ్లుగా తిప్పుతున్నారంటూ 90 ఏండ్ల వృద్ధురాలు అడిషనల్ కలెక్టర్ ముందు గోడు వెల్లబోసుకున్నది.
పుప్పాలగూడ సరిహద్దులోని సర్వే నంబర్ 300తోపాటు 301 సర్వే నంబర్‌ను సర్వే చేయాలంటూ అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సదరు నిర్మాణ రంగ సంస్థ మార్కెటింగ్ కార్యాలయం మొత్తం కాందిశీకుల భూముల్లోనే ఉన్నదని, సర్వే చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. భూమిలో ఎవరి అనుమతులతో నిర్మాణాలు చేపడుతున్నారో తేల్చాలంటూ అక్కడే ఉన్న అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి విజ్ఞప్తి చేశారు. సర్వేయర్ సతీశ్‌రెడ్డిని పిలిచి సర్వేలు చేసి హద్దులు నాటాలని చంద్రారెడ్డి ఆదేశించారు.
సర్వే నంబర్ 300లోని 0-31గుంటల భూమి తమకు చెందినదంటూ న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగా తమ భూమిని సదరు నిర్మాణరంగ సంస్థ యాజమాన్యం బౌన్సర్లను పెట్టి ఆక్రమించుకున్నదంటూ ఫిర్యాదు చేసిన నాగుల కుటుంబసభ్యులకు నార్సింగి పోలీసులు గురువారం నోటీసులు జారీచేశారు. సదరు భూమికి సంబంధించిన పూర్తి రికార్డులు, న్యాయస్థానంలో పోరాడుతున్న రికార్డులను 4 రోజుల్లో పోలీసులకు నివేదించాలని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి నోటీసులు జారీచేశారు. అనుమతి పత్రాలు సమర్పించాలని నోటీసులు జారీచేశామని పోలీసులు చెప్పారు.