మునిపల్లి : సంగారెడ్డి జిల్లా మునిపల్లి ( Munipalli ) మండలంలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ల ( Double registrations ) దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా జోరుగా కొనసాగుతుంది. ముంబై జాతీయ రహదారికి( Mumbai National Highway) మునిపల్లితో పాటు కంకోల్,మేళసంఘం, ఖమ్మంపల్లి, గొర్రెగట్టు, పెద్ద గోపులారం, అంతరం గ్రామాల్లో డబుల్ రిజిస్ట్రేషన్ల భూముల అమ్మకాల వ్యాపారం స్పీడుగా దూసుకుపోతుంది.
గతంలో భూములు కొన్న వారు మ్యూటేషన్‌కు దరఖాస్తు చేసుకోవడంలో ఆలస్యం కావడమే ఆసరగా చేసుకుని మండలంలోని కొంతమంది రియల్ వ్యాపారులు తహసీల్ కార్యాలయంలో అధికారులతో ముందస్తు బేరం కుదుర్చుకుంటే తెల్లారే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలో లేని మునిపల్లి మండలంలో జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సంబంధిత ఉన్నత అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇటీవల మండల కేంద్రమైన మునిపల్లితో పాటు పెద్దగోపులారం, పెద్దచెల్మడ గ్రామాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పలువురు బాధితులు తహసీల్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేశారు.
బుగ్గరామన్న చెరువు సైతం రిజిస్ట్రేషన్..
జిల్లాలోనే పేరుగాంచిన బుగ్గ రామన్న (Bugga Ramanna ) చెరువును గత నాలుగు సంవత్సరాల క్రితం మునిపల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ప్రవీణ్ కుమార్ కొంతమంది రియల్ వ్యాపారులతో చేతులు కలిపి చెరువును రియల్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్ చేయడం రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుగ్గ రామన్న చెరువు రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల వాసులు కలెక్టర్‌ను కోరుతున్నారు.
డబుల్ రిజిస్ట్రేషన్ లకు భలే డిమాండ్
ముంబై జాతీయ రహదారికే అతి దగ్గరలో ఉన్న భూములను టార్గెట్ చేసిన కొంతమంది రియల్ వ్యాపారులు ఎకరాకు సుమారు రూ. 5 లక్షల వరకు ముట్టజెప్పుతున్నట్లు పలువురు రియల్ వ్యాపారులు పేర్కొన్నారు. వచ్చే దాంట్లో రెవెన్యూ అధికారులకే సగం పోతుందని కొందరు డబుల్ రిజిస్ట్రేషన్‌కు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. వక్స్ భూములు సైతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ భూములు కాపాడవలసిన రెవెన్యూ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ నిలిపివేయాలని కోరుతూ పెద్దగాపులరాము రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.