నిడమనూరు, జనవరి 29 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని ఎన్నెస్పీ క్యాంపు ఆవరణలో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. ఎన్నెస్పీ స్థలంలో మండల కేంద్రానికి చెందిన దళిత, వెనుకబడిన కుటుంబాలకు చెందిన ఉప్పునూరి సాంబయ్య, గనిపల్లి కోటమ్మ, నాగిళ్ల ఎల్లమ్మ ఇండ్లు నిర్మించుకొని సుమారు 40 ఏండ్లుగా నివాసం ఉంటున్నారు. 2016లో సర్వే నంబర్ 230లోని 0.32 గుంటల ఎన్నెస్పీ స్థలాన్ని కోర్టు భవన నిర్మాణానికి కేటాయించారు. ఇటీవల కోర్టు భవన నిర్మాణ పనులు పూర్తికావడంతో కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశాలు జారీ చేశారు.
దాంతో నిడమనూరు తహసీల్దార్ జంగాల కృష్ణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం తెల్లవారుజామున జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. బాధితులు ఆందోళన చేపట్టకుండా హాలియా సీఐ జనార్దన్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము 40 ఏండ్లుగా అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా.. ఇంట్లోని సామగ్రి తీసుకునేందుకు అవకాశమివ్వకుండా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం బాధిత కుటుంబాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జీవో 59 కింద స్థలాల క్రమబద్ధీకరణ కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, 25 శాతం ధర మేరకు రూ.40 వేలు కూడా చెల్లించినట్టు వారు తెలిపారు. సీపీఎం, ఎమ్మార్పీఎస్ నాయకులు వారికి మద్దతు తెలిపారు.