హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్ తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లించకపోవడంపై మండిపడింది. కమిషన్ విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీకి నోటీసులు జారీచేసింది. దాడులు, లైంగికదాడులు, వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ బాధితులకు అట్రాసిటీ చట్టం ప్రకారం వారం రోజుల్లోగా పరిహారం చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు నిధులను చెల్లించడం లేదు. ఉత్తర్వులను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైదరాబాద్కు చెం దిన బోయిన ఎల్లేశ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు గత జనవరిలో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 135 మంది బాధితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రావాల్సిన బకాయిలను చెల్లించడం లేదని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విన్నవించారు. ఈ ఫిర్యాదులపై గత ఫిబ్రవరిలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి నోటీసులు జారీచేశాయి. దీంతో గత మార్చి నెలాఖరున ప్రభుత్వం బాధితులకు పరిహారం నిధులను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. చెక్కులు పంపిణీ చేసింది. కానీ ఖాతాల్లో డబ్బు జమకాలేదు. దీంతో ఎల్లేశ్ మరోసారి ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్టీ కమిషన్ తాజాగా మరోసారి ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీకి నోటీసులను జారీచేసింది. బుధవారం నిర్వహించనున్న విచారణకు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే తదుపరి ఉల్లంఘణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ జిల్లాలవారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటుచేస్తూ అట్రాసిటీ కేసులు, చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. అందు లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రస్థాయి కమిటీని రెండేండ్ల క్రితమే ఏర్పాటుచేసింది. కానీ ఈ కమిటీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశాన్ని నిర్వహించకపోవడం సర్కారు ఉదాసీనతకు అద్దం పడుతుంది. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.