హైదరాబాద్: ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలిచింది. నీటిపారుదల శాఖలో ఇటీవలే ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు(AE), 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులు(JTO)లకు ఈ నెల 14న సీఎం రేవంత్ నియామక పత్రాలు (Appointment Letter) అందించనున్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఏఈ, జేటీవో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.
సర్కార్ కక్ష.. అభ్యర్థులకు శిక్ష!
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కక్షకు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు శిక్ష అనుభవిస్తున్నారు. నెలలు గడిచినా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. రేపు, మాపు అంటూ తాత్సారం చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే అసలు ఇచ్చేదే లేదంటూ ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారని ఏఈ (అస్టిస్టెంట్ ఇంజినీర్లు), జేటీవో (జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు)లుగా ఎంపికైన బాధిత అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాల్లో దాదాపు 833 ఏఈ, జేటీవో పోస్టుల భర్తీకి 2022లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అందులో నీటి పారుదలశాఖకు 439 పోస్టులు ఉన్నాయి.
గత అక్టోబర్‌లో రాతపరీక్ష నిర్వహించగా, ఫిబ్రవరిలోనే ఫలితాలు వెల్లడించారు. అపాయింట్మెంట్ ఆర్డర్లను అందుకుని విధుల్లో చేరేందుకు వారంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రే రావాలి? ఆయనే నియామకపత్రాలివ్వాలి అంటూ ఆ తంతును సర్కారు నిర్వహించడమే లేదు. తొలుత ఏప్రిల్ 14న, ఆ తర్వాత 28, మే 2, అదే నెల 7వ తేదీన అని వాయిదాలు వేస్తూ వస్తున్నారు. నియామకపత్రాల పంపిణీ కోసం జలసౌధ ప్రాంగణంలో టెంట్లను కూడా ఏప్రిల్ 28నే వేశారు. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. కానీ కార్యక్రమ తేదీ మాత్రం నిర్ణయించడం లేదు. ఇదేమని ఉన్నతాధికారులను అడిగితే సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలోనే వాయిదా వేస్తున్నట్టు తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, గ్రౌండ్‌వాటర్ తదితర విభాగాలకు తమతోపాటు ఎంపికైన వారు ఇప్పటికే విధుల్లో చేరి వేతనాలను కూడా పొందుతున్నారని ఏఈ, జేటీవోలుగా ఎంపికైన అభ్యర్థులు వాపోతున్నారు. తాజాగా నియామక పత్రాలు అందిస్తారని సీఎం షెడ్యూల్ ఖరారైనప్పటికీ.. అది జరిగేంత వరకు నమ్మకం లేదంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.