రాజకీయ ఆరోపణలు, ఆవేశకావేశాలు సరే, అసలు మెట్రో మొదటిదశకు రుణం ఎందుకాగింది? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టతనివ్వదు? అసలు ఢిల్లీ ఏం కోరుతున్నదో, ఏ మెలిక పెట్టిందో ఎందుకు బయటపెట్టదు? కేంద్రం ప్రతిపాదన తమకెందుకు ఆమోదయోగ్యంకాదో వెల్లడించదేం? కేంద్రమంత్రి ఖట్టర్ కటువుగా చెప్పిన విషయాన్ని వదిలేసి.. కిషన్‌రెడ్డిపై సీఎం చిందులు తొక్కుతున్నదెందుకు? ఐఆర్ఎఫ్సీ రుణం ఆగిన విషయంలో ఏ జరిగిందో నమస్తే తెలంగాణ ఆరా తీయగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
మెట్రో ఫేజ్-1, ఫేజ్-2ను కలుపాల్సిందేనని, రెండు ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా నిర్వహించాలని కేంద్రం స్పష్టంచేసిందని సమాచారం. దీనికి రేవంత్ ససేమిరా అన్నట్టు తెలిసింది. మెట్రో ఫేజ్-1ను తామే చూసుకుంటామని, రెండోదశకు సగం నిధులిచ్చి సహకరించాలని ఆయన కోరారని చెప్తున్నారు. ఆయితే రేవంత్ అంతలా పట్టుబట్టడం వెనుక లోగుట్టు ఏమిటని ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మెట్రోకు ఉన్న అస్తులపై కన్నేశారా? అనే అనుమానంతోనే రుణం మంజూరును నిలిపివేసినట్టు భావిస్తున్నారు.
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : మెట్రో రైలు మొదటి దశకు మంజూరైన రుణం ఆగిపోవడానికి అసలు కారణం ఏమిటి? కిషన్‌రెడ్డి అడ్డుకున్నారా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపిందా? లేదా సీఎం రేవంత్‌రెడ్డి దుందుడుకు నిర్ణయాలే కారణమా? ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది! రుణం ఆగిపోవడానికి కారణం నువ్వంటే.. నువ్వంటూ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా తవ్వగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియమనిబంధనలకు సీఎం రేవంత్‌రెడ్డి ససేమిరా అనడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తేలింది. మరి కేంద్రం ప్రతిపాదనకు సీఎం ఎందుకు ససేమిరా అన్నారు? మొదటి దశ మెట్రోకు ఉన్న ఆస్తులా? రెండో దశ టెండర్ల వ్యవహారమా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రైల్ ఫేజ్-2 డిజైన్‌లో మార్పులు చేసి, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ఎల్అండ్టీ సంస్థ ఒప్పుకోలేదు. కానీ మొదటి, రెండో దశలో ఒకే సంస్థ భాగస్వామ్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మెట్రోరైలు మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకున్నది. రూ.1,461 కోట్ల ఈక్విటీ చెల్లించి వంద శాతం షేర్లు కొనుగోలు చేసింది. మెట్రోపై ఉన్న రూ.13,538 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం పేరుమీదికి బదలాయించేందుకు ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు రుణాన్ని రీ షెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ (ఏషియన్ డెలప్మెంట్ బ్యాంకు), జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ), ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)ను సంప్రదించింది. చివరికి ఐఆర్ఎఫ్సీ ముందుకొచ్చింది. ఈ సంస్థ జైకా నుంచి రుణాలు తీసుకొని రైల్వే, మెట్రో ప్రాజెక్టులకు రుణాలిస్తున్నది. ఈ మేరకు మే 25న ఢిల్లీలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్అండ్టీ మెట్రో రైల్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ మధ్య ఒప్పందం కుదిరింది. వాస్తవానికి రుణం మంజూరైతే ఈ నెల 15 నుంచి మెట్రో మొదటి దశ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రావాలి. కానీ రుణ మంజూరు ఆగిపోయిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి గత వారం ప్రకటించారు. ఇందుకు కారణం కిషన్‌రెడ్డే అని ఆరోపించగా, సీఎం రేవంత్‌రెడ్డి వైఖరే కారణమని కిషన్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, మెట్రో ఫేజ్-2ను కలుపాల్సిందేనని ఖట్టర్ స్పష్టం చేసినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ ఇదే విషయాన్ని చెప్తున్నదని గుర్తు చేశారట! రెండు దశలను కలుపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడాలని, నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని మరోసారి ప్రతిపాదించారని తెలిసింది. ఇందుకు జైపూర్‌లోని మెట్రో రైల్‌ను ఉదహరించినట్టు సమాచారం. అయితే దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ససేమిరా అన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, రెండో దశకు మాత్రం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులిచ్చి సహకరించాలని కోరినట్టు తెలిసింది.
రెండో దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సమ్మతించినట్టు సమాచారం. ముందు నుంచీ కేంద్రం చెప్పినట్టే తాము అన్నీ చేసుకుంటూ వస్తున్నామని, మొదటి దశ స్వాధీనానికి రుణం కూడా తీసుకుంటున్నామని, ఆ మొత్తాన్ని తామే రీ పేమెంట్ చేస్తామని, నిర్వహణ కూడా చూసుకుంటామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ‘మీరు చెప్పనవన్నీ చేసుకుంటూ వచ్చినా చివరకు మళ్లీ ఏదో ఒక మెలిక పెడుతున్నారు’ అంటూ రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. రెండేండ్లుగా తిప్పించుకుంటున్నారని, ఇలాగే కొనసాగితే తమకు కేంద్ర సాయం అవసరం లేదని, రెండో దశ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, ఎన్వోసీ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఖట్టర్, రేవంత్‌రెడ్డి భేటీ అసంపూర్తిగా ముగిసినట్టు తెలిసింది. ఆ తర్వాత తెలంగాణకు విడుదల కావాల్సిన ఐఆర్ఎఫ్సీ రుణం ఆగిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
మెట్రోరైలు మొదటి దశకు సంబంధించి ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థకు అత్యంత విలువైన భూములు, కమర్షియల్ స్పేస్ ఉన్నది. ఉప్పల్, రాయదుర్గం, సికింద్రాబాద్, నాంపల్లి, మియాపూర్ మెట్రోరైలు డిపో ఇలా నగరంలోని కీలక ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల భూములున్నాయి. అదనంగా మెట్రో స్టేషన్లు, వాటికి అనుబంధంగా అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో నిర్మించిన మాల్స్‌లో విలువైన కమర్షియల్ స్పేస్ అందుబాటులో ఉన్నది.
మొదటి దశ స్వాధీనం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఆస్తుల విలువను మదింపు చేయడానికి ట్రాన్సాక్షనల్ అడ్వైజర్‌గా ఐడీబీఐని నియమించింది. ఈ ఏజెన్సీ సర్వే చేసి మెట్రో సంస్థకు ఉన్న అన్ని రకాల ఆస్తుల విలువ రూ.18 వేల కోట్లు అని తేల్చింది. ఈ భూముల కోసమే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెట్రోరైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటే ఆ భూములు, కమర్షియల్ స్పేస్‌పై పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతాయి.
వాటిని తమ అనుయాయులకు అగ్గువకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చిన మొదట్లోనే మెట్రోకు ఉన్న ఆస్తులను దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే అనేక అభ్యంతరాల నేపథ్యంలో విరమించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్-1 పూర్తిగా ప్రభుత్వ పరమైతే తమకు నచ్చినవారికి, నచ్చిన రీతిలో ఆస్తులను కట్టబెట్టవచ్చని భావిస్తున్నట్టు సమాచారం.
ఒకవేళ కేంద్రం ప్రతిపాదనలకు అంగీకరించి, మొదటి, రెండో దశలను కలిపేస్తే రూ.18 వేల కోట్ల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం హక్కులు కోల్పోతుంది. 50 శాతం వాటాతో వాటిపైనా కేంద్ర ప్రభుత్వానికి అధికారం దక్కుతుంది. ఇదే జరిగితే తమ ప్రణాళిక అమలు చేయడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట! అందుకే రెండు దశలను కలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ససేమిరా అంటున్నట్టు చెప్తున్నారు. మెట్రోరైలు ఆస్తులకు పొంచి ఉన్న ముప్పును కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిందని, అందుకే మొదటి దశ స్వాధీనానికి మంజూరైన రుణాన్ని నిలిపివేసిందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.