జగిత్యాల, ఏప్రిల్ 16: దేశమంతా బాగుండాలని ఆ నాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే, సభ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల సభతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు పునాది పడుతుందని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సభ స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం పల్లా పరిశీలించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ పదేండ్ల పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిండా ముంచిందని మండిపడ్డారు.
జగిత్యాల సభను అడ్డుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేందుకు రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ పనికిరాని కాళేశ్వరం అని మాట్లాడిన రేవంత్, సభ సక్సెస్ కాకుండా అదే రోజు మేడిగడ్డ బరాజ్ వద్ద సభ పెట్టేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టుల వద్ద ఒక్క తట్టెడు మట్టి ఎత్తని, మూడు బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సభకు ప్రజలు రాకుండా ఉండేందుకు జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై బ్రిడ్జి ని తవ్వుతున్నారని విమర్శించారు.
రెండున్నరేండ్ల క్రితమే టెండర్ పూర్తయిందని, ఇన్నాళ్లూ గుర్తుకురాని పనులు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జగిత్యాల సభకు బస్సులు ఇవ్వద్దని రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి ప్రాంతంలో అధికారులను కరీంనగర్ జిల్లా మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రభు త్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా జగిత్యాల ప్రాంతానికి ఒక చరిత్ర ఉందని, ప్రతిపక్షాలు చేసే ప్రతి పనీ వారి పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు వెన్నుదన్నుగా ఉండి సభను జయప్రదం చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివస్తారన్నారు.
జీవన్‌రెడ్డి పార్టీలోకి వస్తున్న సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ సభ ఇన్చార్జి ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్‌రావుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీమం త్రి జీవన్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, లోక బాపురెడ్డి, దావ సురేశ్, ఆయిల్నేని వెంకటేశ్వర్రావు, అవారి శివకేసరి బాబు, దుర్వయ్య, శీలం ప్రవీణ్ పాల్గొన్నారు.