Indiramma Indlu | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు అనుసరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల ప్రారంభోత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. నిరుడు మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం ప్రారంభించినా ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ ఆదివారం పథకాన్ని మళ్లీ ప్రారంభించారు. ఒకే పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారని రాజకీయవర్గాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అయోమయంగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. నిరుడు మార్చి 11న భద్రాచలంలోసీఎం ఇందిరమa్మ ఇండ్ల పథకాన్ని రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొందరికి మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఆదివారం కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతోపాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం మరోసారి ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కోస్గీలో కొందరికి మంజూరు పత్రాలిచ్చారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు కోసం నిరీక్షిస్తున్న పేదలు కాంగ్రెస్ సర్కారు తీరుతో అయోమయానికి గురవుతున్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇంటింటి సర్వే పూర్తికాలేదు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు గ్రామసభల్లో ప్రకటించారు. ఇవి తుదిజాబితాలు కాదని, మార్పులు చేర్పులు ఉంటాయని, దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. జాగ ఉంటేనే ఇల్లు ఇస్తారా, ఇల్లు కట్టి ఇస్తారా అనే విషయంలో సీఎం, మంత్రులు, అధికారులు స్పష్టతనివ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-పీఎంఏవైతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అనుసంధానం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పీఎంఏవై మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కోసం కేంద్రం యాప్ రూపొందించింది. దరఖాస్తుదారుల వివరాలను ఆ యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ పూర్తికాలేదు. మరి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఇండ్లు మంజూరు చేశామని చెప్పడం, పత్రాలు ఇవ్వడం అంతా బూటకమని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇందిరమ్మ పేరుంటే కేంద్రం నుంచి నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్యలో ఇల్లు కోసం నిరీక్షిస్తున్న తమ ఆశలు నెరవేరడం లేదని పేదలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రారంభోత్సవాలతో కాలయాపన చేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.