హైదరాబాద్, ఆగస్ట్ 28 (నమస్తేతెలంగాణ): ‘రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా? పోలీస్ పాలనా? ఊరూరా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డీ.. ఇదేనా మీరు తెచ్చిన మార్పు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీస్ అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతుపిసికి క్రూరంగా ప్రవర్తించాడని తెలిపారు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తిని పోలీసులు బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించినట్టు ఆరోపణలొచ్చాయని పేర్కొన్నారు. తాజాగా సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని పోలీసులు కేసులు పెట్టి బడ్డీ కొట్టు తొలగించారని, నిరసన తెలిపిన వారిపై కోదాడ సీఐ దౌర్జన్యం చేశాడని ఎక్స్ వేదికగా వివరించారు.
ప్రజాపాలన ముసుగులో రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని ధ్వజమెత్తారు. సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్షాలు, రైతులు, విద్యార్థులపై పోలీసులతో జులుం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, నిరసన తెలిపిన వారి అరెస్టులు, హక్కులు అడిగిన వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మీరు చెప్పుకొంటున్న ఇందిరమ్మ పాలన? ఇదేనా అని నిలదీశారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చొరవ తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.