Dharmapuri Arvind | రాష్ట్రంలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు రూ.42వేల కోట్లు బ్యాంకులకు చెల్లించేందుకు జరుగుతున్న యత్నాలను ఆయన బయటపెట్టారు. రూ.600 కోట్ల అప్పు ఉంటే రూ.42 వేల కోట్లు ఎలా కడతారని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ అని విమర్శించారు.
షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా చేసేందుకే రేవంత్ రెడ్డి హడావుడిగా బకాయిల విడుదలకు బ్యాంకర్లతో చర్చిస్తున్నారని ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రియల్ఎస్టేట్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రైతులకు రుణమాఫీ జరగదని వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్కు ప్రజలు, ఓటర్లు గుర్తుకొస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు.. ఆరు గుడ్లలాంటివి అని.. అవి ఎప్పుడు పొదుగుతాయో తెలియవని విమర్శించారు. రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పి.. రైతుబంధును బంద్ చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు.