హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): భూభారతి పోర్టల్ నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భూభారతి పోర్టల్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో భూ భారతి పోర్టల్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా వెబ్సైట్ ఉండాలని సూచించారు. ఇది కనీసం 100 ఏండ్లపాటు పనిచేసేలా ఉండాలని, భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అయితే, భూభారతి పోర్టల్‌ను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రెవెన్యూశాఖ నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) చూస్తున్నది. గతంలో ధరణి పోర్టల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ప్రైవేట్ సంస్థను తొలగించి ఎన్ఐసీకి అప్పగించింది. ధరణి స్థానంలో వస్తున్న భూభారతి పోర్టల్‌ను మళ్లీ విశ్వసనీయ సంస్థకు అప్పగించాలనే సీఎం వ్యాఖ్యలు దేనికి నిదర్శనమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ విశ్వసనీయతను సీఎం రేవంత్‌రెడ్డి శంకిస్తున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.