హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా?. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలపై సీనియర్ మంత్రులు మొదటి నుంచీ గుర్రుగా ఉండగా, ఇటీవల మరింత ముదిరినట్టు చెప్పుకుంటున్నారు. సీఎం తీరుపై మంత్రివర్గంలో సగం మంది వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని చెప్తున్నారు. కొందరిని ఆయన దూరం పెట్టగా.. మరికొందరు ఆయనతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు ఇటీవలి ఉదాహరణలే నిదర్శనంగా పేర్కొంటున్నారు. బుధవారం సచివాలయంలో ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కనీసం తోడుగా ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా రాకపోవడం గమనార్హం.
ఆ సమయంలో సచివాలయంలో, అందుబాటులో పలువురు మంత్రులు ఉన్నారట. అయి నా సీఎం ఒంటరిగానే కార్యక్రమానికి రావడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయంలో జరిగిన ఏ సమావేశంలోనూ సీఎం ఇలా ఒంటరిగా హాజరు కాలేదని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. సీఎం విదేశీపర్యటనలకు వెళ్లి వచ్చినపుడు సాధారణంగా మంత్రులు వెళ్లి స్వాగతం పలుకుతుంటారు. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగివచ్చినపుడు మం త్రులు వెళ్లకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం.. 23న తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదు. సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే వెళ్లారు. అప్పుడే సీఎంతో మంత్రులంతా ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నట్టు వార్తలు రాగా.. బుధవారం ఘటనతో ఇది నిర్ధారణ అయ్యిందని చర్చనడుస్తున్నది.
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అత్యధిక శాతం సమీక్షలు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచే నిర్వహిస్తున్నారు. దీనిపై సీనియర్ మంత్రులు మొదటి నుంచీ గుర్రుగా ఉన్నారట. మొదట్లో కొందరు మొహమాటానికి వెళ్లినా.. ఆ తర్వాత సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని, సీఎం ఇంట్లో నిర్వహించే సమీక్షలకు తాము రాలేమని తేల్చి చెప్పినట్టు సమాచారం. అందుకే ఇటీవల ఓ సీనియర్ మంత్రి హైదరాబాద్‌లో అందుబాటులో ఉండి కూడా తనకు సంబంధించిన శాఖ సమీక్షకు గైర్హాజరు అయినట్టు చెప్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఇంట్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయని ఇద్దరు మంత్రులు తెగేసి చెప్పడంతో సీఎం దిగివచ్చారని చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచే బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) సీఎం రావడం పెరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సీసీసీలో మీటింగ్‌లపైనా మంత్రుల్లో భిన్నవాదనలు ఉన్నట్టు సమాచారం. అంత పెద్ద సచివాలయం ఉండగా.. సీసీసీలో మీటింగ్‌లు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని చర్చించుకుంటున్నారట. ప్రతి సమీక్షకు సచివాలయం నుంచి మంత్రులు, అధికారులు సీసీసీకి రావాల్సి వస్తున్నదని, ఇది ప్రజాధనం వృథా చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారట. ఏదేమైనా సీఎం ఇంట్లో సమీక్షలను నిలువరించగలిగామని పలువురితో అన్నట్టు తెలిసింది.
ఏరికోరి మంత్రి పదవి ఇచ్చిన ‘పాత పార్టీ’ మిత్రుడితో కూడా సీఎంకు ఇప్పుడు సఖ్యత లేదని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ మంత్రి వద్ద ఉన్న కార్యదర్శులకు సీఎం నేరుగా ఫోన్‌చేసి ఆదేశాలు ఇస్తున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఆ మంత్రికి సంబంధించిన ఫైళ్లన్నీ నేరుగా తన కార్యాలయానికే పంపాలని, తనకు చెప్పకుండా ఏలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే అదనుగా ఆ శాఖలోని ఓ మహిళా అధికారి కింది స్థాయి అధికారులకు ఫోన్లు చేసి మంత్రి ఇచ్చే ఆదేశాలు పాటించవద్దని చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ఆ శాఖలో గతంలో పిలిచిన, మంత్రి చెప్పిన కొన్ని టెండర్లను కూడా ఏలాంటి కారణం చూపకుండానే రద్దు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం అత్యంత సన్నిహితుడిగా ఉండే సలహాదారుడికి ఫోన్ చేసి ‘అన్నా.. ఇట్లయితే ఇక్కడ నేనెందుకున్న ట్టు’ అని ఘాటుగా మాట్లాడినట్టు తెలిసింది. ఆ టెండర్లలో ఒకదాని కోసం కరీంనగర్‌కు చెందిన ఓ నేత సీఎం వద్దకు వెళ్లి చెప్పించుకున్నాడని, అందుకే రద్దు చేసి ఉంటారని ఆ సలహాదారు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓ మంత్రి కొంతమంది మండల స్థాయి అధికారుల బదిలీలకు సంబంధించిన ఫైలును పట్టుకొని సీఎం వద్దకు వెళ్లారట. ఆ జాబితాను సీఎంకు ఇవ్వబోతే.. ‘నా కెందుకు.. మీరే అన్నీ చేసుకుంటున్నారు కదా.. ఇది కూడా చేసుకోండి’ అని సీఎం గట్టిగానే చెప్పినట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో ఆ మంత్రి నొచ్చుకొని.. ఫైలును అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మంత్రి ఒకప్పుడు సీఎంకు తలలో నాలుకలా ఉండేవారని, నంబర్-2 తానే అన్నట్టుగా వ్యవహరించారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడా మంత్రికి, సీఎంకు మధ్య విబేధాలు పెరిగాయని పలువురు పేర్కొంటున్నారు.