హైదరాబాద్ : రాష్టంలో తాగునీటి కష్టాల ( Driking Water ) ను రేవంత్ రెడ్డి తిరిగి తెచ్చారని అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) ఆరోపించారు. మార్పు రావాలంటూ ప్రజలను మోసం చేసి నీటి కష్టాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ప్రజలపై ప్రేమ లేదని ట్విటర్ వేదికలో విమర్శించారు. పల్లె నుంచి పట్నం దాకా తాగు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పథకాలు ఉన్నాయి. ఫలితం లేదు. పైపులు ఉన్నాయి నీళ్లు రావుని విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగు నీరు సరఫరా చేశారని గుర్తు చేశారు. రేవంత్ కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేక పోతున్నాడని పేర్కొన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ఎక్కడ చూసినా మళ్లీ ట్యాంకర్లు, బిందెలు, డ్రమ్ములు దర్శనం ఇస్తున్నాయని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్పై కోపంతో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. నోటి నుండి అబద్దాల ప్రవాహాన్ని పారించడం మానేసి, మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు పారించాలని, ప్రజల కన్నీటి బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు.