హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ‘ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నది. వెలిగొండ ప్రాజెక్టు, నల్లమలసాగర్ రిజర్వాయర్ ద్వారా అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ముమ్మరంగా పనులు చేపట్టింది. ఆ ప్రయత్నాలను రేవంత్ సర్కార్ అడ్డుకోవాలి’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ నీటి అక్రమ తరలింపును అడ్డుకోకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ నేత అభిలాశ్ రంగినేనితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 31న ఆ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయని చెప్పారు. అటవీ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకుండానే ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా శ్రీశైలం డ్యామ్ వద్ద కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ధర్నా చేస్తామంటే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేఆర్ఎంబీ ముందు పోరాడాలని సూచించారు. నాగార్జునసాగర్ నిండినా రైతులకు సాగునీరు ఇవ్వబోమని మంత్రి చెప్పడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. సాగునీళ్లివ్వడం చేతకాకపోతే తమ అసహాయతను ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేయడం వెనుక కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీ సాగునీటి తరలింపును అడ్డుకోకపోతే ఈ ప్రభుత్వం చరిత్రలో అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా మిగిలిపోతుందని స్పష్టంచేశారు.
ఎల్ నినో పేరు చెప్పి అన్నదాతకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పంటలు వేయొద్దని రైతులను భయపెట్టి వారిని దగా చేస్తున్నదని ధ్వజమెత్తారు. శ్రీశైలంలో 170 టీఎంసీల నీళ్లున్నా.. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు నీళ్లివ్వడమే లేదని తెలిపారు. కేఎల్ఐ కాలువ చివరివరకు సాగునీరు చేరకపోవడం జిల్లా మంత్రుల అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. రోజుకుసగటున 12 టీఎంసీల నీటిని ఏపీకి తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, జూరాల పంపులను నిరంతరాయంగా నడుపుతూ సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.