CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కొండారెడ్డిపల్లిలో రేవంత్ సోదరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. చాలావరకు వాటిని బయటకు పొక్కకుండా రేవంత్రెడ్డి సోదరులు మేనేజ్ చేసినట్టు తెలుస్తున్నది. తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు కూడా రేవంత్ సోదరులే కారణమయ్యారని తెలిసింది. ఇదే విషయాన్ని మాజీ సర్పంచ్ పాంకట్ల సాయిరెడ్డి గతంలో ఓ మీడియా సంస్థకు చెప్పారు. అందుకే అతడిపై రేవంత్ బ్రదర్స్ కక్షగట్టినట్టు తెలుస్తున్నది. సాయిరెడ్డి మీడియా సం స్థకు చెప్పిన వివరాల ప్రకారం.. రేవంత్రెడ్డి అన్న కృష్ణారెడ్డి కుటుంబం, వారి కుటుంబానికే చెందిన ఎనుముల గురువారెడ్డి మధ్య మూడేండ్లుగా భూవివాదం ఉన్నది.
ఎనుముల కృష్ణారెడ్డి (రేవంత్ సోదరుడు) కుటుంబానికి చెందిన రెండున్నర ఎకరాల భూమిని ఎనుముల గురువారెడ్డితో కల్సి తనఖా పెట్టారు. వచ్చిన డబ్బుల విషయంలో ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో గురువారెడ్డిని రేవంత్రెడ్డి అన్న బంధువులు ఫిబ్రవరి 21న రాత్రివేళ కొట్టుకుంటూ తీసుకొచ్చి కొండారెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బ్రహ్మంగారి గుడిలో రాత్రి బంధించారు. ఆయన తప్పించుకొని వెళ్లకుండా గుడికి తాళంవేశారు. ఊరిలో తన పరువు పోతుందని భావించిన గురువారెడ్డి ఆ రాత్రే ఉరేసుకొని చనిపోయాడు. గుడిని ఊడ్చే వ్యక్తి చూసేసరికి గురువారెడ్డి తన పంచెతో ఉరేసుకొని వేళాడటం గమనించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా రేవంత్ సోదరులు దాచిపెట్టారని, ఈ విషయాన్ని మీడియాకు వెళ్లడించాడన్న కారణంతోనే సాయిరెడ్డిపై రేవంత్ సోదరులు కక్షగట్టారని తెలిసింది. ఈ విషయంపై రేవంత్రెడ్డి అనుచరులు కూడా సాయిరెడ్డి వద్ద పలు సందర్భాల్లో ప్రస్తావించినట్టు తెలిసింది.