జ్యోతినగర్,(రామగుండం), జనవరి 23 : ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి పింఛన్ సాంక్షన్ చేయాలని వెళ్లిన రిటైర్డు ఉపాధ్యాయుడి వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ ట్రెజరీ అధికారి, సబార్డినేట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండంలోని రిటైర్డ్ ఉపాధ్యాయుడు కన్నూరి ఆనంద్‌రావు తనకు పింఛన్ మంజూరు చేయాలని స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాడు. ఎస్టీవో ఏకుల మహేశ్వర్ రూ.10 వేలు లంచం ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు కృష్ణకుమార్, పున్నం చందర్, అధికారులు ఇచ్చిన రూ.10 వేలను తీసుకెళ్లి సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎస్టీవో , ఆఫీస్ సబ్ ఆర్డినేట్ రెడ్డవేన పవన్‌కు ఇచ్చాడు. అదే సమయానికి ఏసీబీ అధికారులు కార్యాలయంలో దాడులు చేయగా ఎస్టీవో రూ.9 వేలు, అటెండర్ పవన్ రూ.వెయ్యి తీసుకుంటూ పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరు
పరుచనున్నారు.