Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలన్న వాంఛతో భారత్‌పై క్షిపణుల దాడికి దిగింది. కానీ దుస్సాహసంతో కాలుదువ్విన పాకిస్థాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెబుతోంది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో పోరుపై పలువురు మాజీ సైనికులు నమస్తే తెలంగాణతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మళ్లీ సైన్యంలో చేరేందుకు సిద్ధం..
2002లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌లో చేరాను. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో 8 ఏండ్లు పనిచేసిన. పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకల చర్యలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టాం. 2019లో రిటైర్ అయ్యాను. ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తున్నది. సైన్యం నన్ను పిలిస్తే సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా.
-నాచోనియా భవాని, రిటైర్డ్ ఆర్మీ జవాన్, గంగాపూర్, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా
పాకిస్థాన్‌కు ఓటమి తప్పదు
భారత్‌తో ఎప్పుడు పెట్టుకున్నా పాకిస్థాన్‌కు ఓటమి తప్పదు. మనం అన్ని రంగాల్లో బలంగా ఉన్నాం. మన ముందు పాకిస్థాన్ నిలబడలేదు. నేను 1980 నుంచి 1988 వరకు ఆర్మీలో పనిచేసిన. బార్డర్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. బార్డర్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో 1985లో కౌంటర్ అటాక్‌లో రెండు బుల్లెట్ గాయాలు కావడంతో ఉద్యోగం వీడాల్సి వచ్చింది. ఆర్మీలో చేరి బార్డర్లో విధులు నిర్వహించడం అంటే గర్వంగా ఉంటుంది.
-దుగ్గెపోగు రాజేంద్రకుమార్, మాజీ సైనికుడు, రెబ్బెన, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
భారత్ దాడి సరైనదే..
ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేస్తున్న దాడి సరైందే. పాకిస్థాన్ కవ్వింపు చర్యలను చూస్తూ ఉపేక్షించేది లేదు. సైనికుడిగా పనిచేయాలనే కోరికతో నేను 2000 సంవత్సరంలో మిల్ట్రీలో చేరాను. 2007 వరకు పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పనిచేశా. నిత్యం కూంబింగ్ జరిగేది. రోజూ పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడేవారు. జమ్మూకశ్మీర్‌లోని మచ్చల్ సెక్టార్ వద్ద జరిగిన కాల్పుల్లో నేను తీవ్రంగా గాయపడ్డా. హెలికాప్టర్లో దవాఖానకు తరలించారు. రెండు నెలలు చికిత్స పొంది మిల్ట్రీ నుంచి తిరిగి వచ్చేశా.
-పల్లా వెంకటేశ్వర్లు, దామరచర్ల, నల్లగొండ జిల్లా
భారత్‌ను పాక్ ఢీకొట్టలేదు
భారత్‌ను ఢీకొట్టే సత్తా పాకిస్థాన్‌కు లేదు. భారత సైన్యం అన్ని రంగాల్లో బలంగా ఉంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా మనకు ఉంది. 1998 ఆగస్టు 19న ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా చేరా. 1999 కార్గిల్ వార్ పాల్గొన్నా. జమ్మూకశ్మీర్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణ, మహారాష్ట్ర, ఢిల్లీలో 18 ఏండ్లపాటు విధులు నిర్వహించా. కార్గిల్ యుద్ధ సమయంలో సరిహద్దుల్లోని డేంజర్ జోన్లో ఏర్పాటు చేసిన పికెట్‌లో ఒక కమాండర్ ఆధ్వర్యంలో ఆరుగురు సెంట్రీలం పోస్టు డ్యూటీ, పెట్రోలింగ్, క్యూఆర్టీ, ఆర్వోపీ, అంబూస్లో డ్యూటీ చేసే వాళ్లం. రాత్రీపగలు వంతెనలు, రహదారులను క్షుణ్ణంగా పరిశీలించేవాళ్లం. శత్రువులు మన భూభాగం వైపు రాకుండా అర్ధరాత్రి చీకట్లో కిరోసిన్ దీపాలు పట్టుకొని కాపలా కాసేవాళ్లం. గడ్డకట్టే మంచులో బుకారీ (ఇనుప డబ్బా)లో రైలు బొగ్గుకు మంట పెట్టి దాని వేడికి అక్కడ నిలబడి డ్యూటీ చేసేవాళ్లం.
-కొమ్ము కోటేశ్, మాజీ సైనికుడు, అయిటిపాముల, కట్టంగూర్ మండలం, నల్లగొండ జిల్లా
నాడే పాకిస్థాన్‌ను ఖతం చేసే వాళ్లం
రెండుసార్లు పాకిస్థాన్‌ను మట్టుబెట్టే దిశగా ముందుకు పోయామని, నాటి ప్రధానమంత్రుల ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని మాజీ సైనికుడు సంది పాపిరెడ్డి తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పాపిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో తన అనుభవాలను పంచుకున్నారు. 1965లో ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ధైర్యంతో ముందుకు వెళ్లి లాహోర్ దగ్గరకు చేరుకున్నాం. కానీ అప్పటి ప్రధాని ఆదేశాలతో వెనక్కి తగ్గాం. ఆ ఒక్కరోజు ప్రధాని ఆదేశాలు రాకుంటే లాహోర్‌ను మట్టుబెట్టేవాళ్లం. 1971లో కూడా పాకిస్థాన్‌తో రెండోసారి యుద్ధం చేయాల్సి వచ్చింది. 19 రోజులపాటు వారితో యుద్ధం చేశాం. 99వేల మంది పాకిస్థాన్ సైన్యాన్ని గ్వాలియర్ వద్ద బంధించి తీసుకొచ్చాం. వారిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అప్పగిస్తే మూడు నెలల తరువాత వారిని పంపించారు. అప్పుడే పాకిస్థాన్‌ను ఖతం చేస్తే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదు.
-సంది పాపిరెడ్డి, మాజీ సైనికుడు