హైదరాబాద్/ముషీరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం భేషజాలు పక్కనపెట్టి కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేసి రైతులు, ప్రజలను ఆదుకోవాలని రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోతినేని సుదర్శన్‌రావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదురొంటున్నందున సాగు, తాగునీటి కోసం తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్డీఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపి దాని ఆధారంగా నీటిని లిఫ్ట్ చేసేందుకు అనుమతి తీసుకోవాలని కోరారు. రిటైర్డ్ ఇంజనీర్లందరం కలిసి మరోసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను సందర్శించామని, నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నదని శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సలహాలిచ్చిన వారిపైనే దుమ్మెత్తి పోయకుండా నీళ్లెత్తే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అంతకుముందు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తీర్మానం ప్రవేశపెట్టారు.
రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది ఎంపీలు ఎన్డీఎస్ఏపై ఒత్తిడి చేసి లిఫ్ట్ చేసేందుకు అనుమతులు ఎందుకు తీసుకురారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నీళ్లెత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఏఐకేఎస్ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో రైతు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.