హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు అరిగోసపడుతున్నరు.. ఇండ్లల్లో ప్రశాంతంగా ఉండాల్సిన వారు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నరు.’ అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు హమీద్, శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌రావు, రాఘవేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఆరునెలల్లోగా ఇస్తామని చెప్పిన పీఆర్సీ ఊసేలేదని, డీఏలకు దిక్కులేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గతేడాది మార్చి నుంచి జనవరి 31 వరకు 8,764 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్, జీఎల్ఐ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలనలో అటు రైతుల నుంచి ఉద్యోగుల దాకా ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని విమర్శించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తల వేతనాలు రూ.26 వేలకు పెంచుతామని చెప్పి నట్టేట ముంచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే ఉద్యోగులు తప్ప.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పాలనలో విరమణ పొందిన రోజే బెనిఫిట్స్ అందించేవారని గుర్తుచేశారు.
కేసీఆర్ కేంద్రంతో సఖ్యత లేని కారణంగానే రాష్ట్రానికి నిధులు రావడంలేదని దుష్ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సఖ్యతగా ఉండి సాధించిందేంటని దేవీప్రసాద్ నిలదీశారు. 30సార్లు ఢిల్లీకి వెళ్లి ఆయన రాష్ట్రానికి తెచ్చిన నిధులెన్నో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం ఆయన సొంతజిల్లాను సస్యశ్యామలంగా మార్చే పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా సాధనలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై ఆయా వర్గాలతోపాటు కాంగ్రెస్ నాయకులే సంతృప్తిగా లేరని దేవీప్రసాద్ ఆరోపించారు. అందుకు నిదర్శనం కాంగ్రెస్ ఎమ్మెల్సీయే కులగణన నివేదిక కాల్చివేయడమని గుర్తుచేశారు. రాష్ట్రంలో నిర్బంధకాండ కొనసాగుతున్నదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.