హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (ఆర్ఎస్పీ) బీఆర్ఎస్లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్ను ఎందుకు ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా సకల కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై విల్లంబులు ఎక్కుపెట్టి తూర్పారబడుతున్న దశలో ఆర్ఎస్పీ చేరిక ఒక ఆసక్తికర పరిణామమని, భవిష్యత్తు పరిణామాలకు సూచిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నాడు ప్రజల కష్టసుఖాలను నేరుగా చూసిన ఎందరో సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్, ఐపీఎస్ సహా స్టేట్క్యాడర్ ఉద్యోగులు) కేసీఆర్‌తో కలిసి అడుగులో అడుగులేశారు.
నాడు ఉద్యమ నిర్మాణంలో..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరులో తాము కేసీఆర్ వెంట నడుస్తామని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్ట్ అధికారులు బీఆర్ఎస్లో చేరడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 2014లో ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. స్వరాష్ట్రంలోవారి సేవలకు కేసీఆర్ తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఇచ్చి గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో 2011 ఫిబ్రవరి 4న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఏ రామ్‌లక్ష్మణ్, ఏకే గోయల్ బీఆర్ఎస్లో చేరారు.
ఆ తరువాత ఏపిల్ 27న (టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నాడు) ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి రిటైరైన పేర్వారం రాములు, ఆ తరువాత 2013 ఏప్రిల్ 21న తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ ఐఏఎస్ కేవీ రమణాచారి, ఆ తరువాత మరో సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి లాంటి ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్పీ చేరికను కూడా అదే కోవలో చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆసక్తికర మలుపులో బహుజన రాజకీయాలు
పోలీసు ఉన్నతాధికారిగా, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థకు సుదీర్ఘకాలం కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దళిత బహుజనవాదంపై చిత్తశుద్ధితో ఉన్నారనడానికి వివిధ దశల్లో ఆయన ప్రయాణమే సాక్ష్యమని ఆయనను దగ్గరి నుంచి చూసినవారు చెప్తారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకించి ప్రభుత్వ పెద్దల నుంచి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవినే ఆఫర్ చేశారని, అయితే తాను సున్నితంగా తిరస్కరించానని వెల్లడించడమే కాకుండా తాను కట్టేసుకునే గొడ్డును కాదని, ప్రశ్నల కొడవళ్లను సంధించే ఆయుధాన్నని ప్రకటించారు.
తన రాజకీయ భావజాలానికి బీఆర్ఎస్ సరైన వేదిక అని కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేముందు కుండబద్దలు కొట్టడం విశేషం. ‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే నాకు పరమావధి. అందుకే కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్ఎస్లో చేరుతున్నా’ అని ఆర్ఎస్పీ స్పష్టం చేయడంతో రాష్ట్రంలోని మేధావివర్గం, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాల్లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్పీ చేరికతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయనే వాదన వినిపిస్తున్నది.