Ration Cards | భీమారం, జనవరి 18 : ‘మాకు రేషన్ బియ్యం వస్తలేవు. లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయి. అందులో కొంతమంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందించారు. అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకోం. గ్రామసభ రో జు ఎంపీడీవో, తహసీల్దార్‌ను నిర్బంధిస్తాం.’ అం టూ శుక్రవారం మంచిర్యాల జిల్లా భీమారం మం డల కేంద్రానికి చెందిన యువకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో శనివారం పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తితో పాటు సిబ్బంది 4 టీంలుగా ఏర్పడి మండల కేంద్రంలో మరోసారి సర్వే నిర్వహించారు. ఇప్పటికే రేషన్ కార్డు లిస్ట్ విడుదల చేయగా, మరోసారి సర్వే ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 21న గ్రామసభ ఉండగా అడ్డుకోకుండా ఉండేందుకు తాత్కాలిక సర్వేను చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నా యి. ఎంపీడీవో మధుసూదన్, తహసీల్దార్ సదానందం, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కుమార్ దీపక్‌తో మాట్లాడి సర్వే కోసం అనుమతులు తీసుకున్నట్టు కాంగ్రెస్ జిల్లా నేత సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.
తప్పులతడకగా రేషన్ కార్డుల జాబితా
అర్హుల పేర్లు గల్లంతుపై గ్రామస్తుల నిలదీత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం నిజామాబాద్ జిల్లా సులేమాన్‌నగర్ లో రేషన్ కార్డుల సర్వేపై స్థానికులు అధికారులను నిలదీశారు. సర్వేను సక్రమంగా నిర్వహించడంలేదని పంచాయతీ కార్యదర్శిపై మం డిపడ్డారు. ఎన్నో ఏండ్లుగా గ్రామంలో నివాసముంటున్న తమ పేర్లు జాబితాలో లేవని, సర్వే సక్రమంగా చేయాలని డిమాండ్ చేశారు.