హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రోస్టేట్ (వీర్యగ్రంథి)లో నొప్పితో బాధపడుతున్న రోగికి యశోద వైద్యులు అత్యాధునిక ‘రెజమ్’ థెరపి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ రకమైన వైద్య చికిత్సను తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నిర్వహించినట్టు దవాఖాన వర్గాలు పేర్కొన్నాయి. కామారెడ్డి చెందిన రైతు ఎస్ అంజాగౌడ్ (68) కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. గత నెలలో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన యశోద డాక్టర్లు ప్రోస్టేట్ అబ్స్ట్రక్షన్స్(బ్లాకేజ్)సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వయస్సు రీత్యా శస్త్రచికిత్స వల్ల ఇబ్బందులు కలిగే అవకాశముండటంతో ‘రెజమ్ వాటర్ వేపర్ థెరపీ’తో చికిత్స చేయాలని నిర్ణయించారు. గతనెల 28న సోమాజిగూడ యశోద దవాఖానలో రోగికి విజయవంతంగా ‘రెజమ్ వాటర్ వేపర్ థెరపి’ నిర్వహించారు. యశోద హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ వీ సూర్యప్రకాశ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ శస్త్రచికిత్స ఇష్టపడని యువ రోగులకు ఈ రెజమ్ చికిత్సా పద్ధతి ఉత్తమమైన ప్రత్యమ్నాయం అని చెప్పారు. ఈ చికిత్స తరువాత యువ రోగుల్లో ఎలాంటి లైంగిక సంబంధిత సమస్యలు ఏర్పడబోవని స్పష్టం చేశారు. రెజమ్ థెరపి ద్వారా మూత్రనాళంపై ఒత్తిడి కలిగించే అదనపు ప్రొస్టేట్ కణజాలాన్ని సమర్థంగా తొలగించవచ్చని వివరించారు. ఈ చికిత్స ఒక్క రోజులోనే పూర్తవుతుందని, అదేరోజున డిశ్చార్జి చేయవచ్చని వివరించారు.