కామారెడ్డి, మే 15: కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్‌సింగ్‌పై పోలీసులు బుధవారం ఐదు కేసులు నమోదు చేశారు. డీఎంహెచ్‌వో తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఇటీవల 20 మంది మహిళా డాక్టర్లు కలెక్టర్, ఎస్పీతోపాటు రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్‌సింగ్ నాయక్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మద్దతుగా రాగా.. మహిళా మెడికల్ ఆఫీసర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమను ఎలా ఇబ్బంది పెట్టారో వివరించారు.
తనిఖీల పేరిట వచ్చి అసభ్యకరంగా తాకడం, ఒడిలో కూర్చోవాలని ఒత్తిడి చేయడం వంటివి చేసేవాడని వాపోయారు. మూడు గంటల పాటు సాగిన విచారణ అనంతరం బాధిత మహిళా డాక్టర్లు దేవునిపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద ఐదు కేసులు నమోదు చేశారు. త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకోనున్నట్టు తెలిపారు.