హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): సినిమా థియేటర్లలో రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏండ్లలోపు పిల్లలను అనుమతించరాదన్న ఆంక్షలను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు గతంలో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. ‘పుష్ప-2’, ’గేమ్ చేంజర్’ సినిమా టికెట్ల ధర పెంపునకు, అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేయడంతో సినిమా హాళ్లలోకి పిల్లలను ఏ సమయాల్లో అనుమతించాలో స్పష్టం చేస్తూ జనవరి 24న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేయాలని కోరుతూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితరులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంపై అన్ని పక్షాలతో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు.