Viral News | ఆత్మకూర్.ఎస్/దేవరుప్పుల, జూలై 28: పోటెత్తున్న వరదతో ఊరంతా తడిసి ముద్దయ్యింది. కరెంట్ సరఫరా ఆగి ఊరంతా అంధకారమయింది. గ్రామస్థుల అవస్థలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఓ ఎలక్రిక్టల్ హెల్పర్ సాహసం చేశాడు. హోరువానలోనూ ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి గ్రామంలో వెలుగులు నింపాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా, సోషల్ మీడియాలో ఎలక్రిక్టల్ హెల్పర్‌ను అభినందనల వరద ముంచెత్తుతున్నది.
వర్షాల నేపథ్యంలో పాతర్లపహాడ్ గ్రామానికి కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెరువు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం మీద సమస్య తలెత్తినట్టు లైన్‌మన్ కింద హెల్పర్‌గా పనిచేస్తున్న సంతోష్‌గౌడ్ గుర్తించాడు. విపత్కర పరిస్థితుల్లోనూ.. ఈదుకుంటూ వెళ్లి చెరువులో మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి దెబ్బతిన్న తీగకు మరమ్మతులు చేశాడు. గ్రామం మొత్తానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గ్రామస్థులతోపాటు ఇతరులు కూడా సంతోష్ సేవలకు సలాం కొడుతున్నారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా తన ఫేస్బుక్లో ఆ వీడియోను పోస్ట్ చేసి సంతోష్ సాహసాన్ని, వృత్తి పట్ల నిబద్ధతను అభినందించారు.
జనగామ జిల్లాలో జేఎల్ఎం సాహసం
చెరువులో తెగిపడిన హైటెన్షన్ వైర్‌ను అతికించి విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ చేశాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురానికి చెందిన జూనియర్ లైన్మెన్ రహమాన్. ధర్మాపురం ఊరచెరువు మధ్యలో 11 కేవీ హైటెన్షన్ వైర్లు ఉండగా గురువారం సంభవించిన గాలి దుమారం, భారీ వర్షానికి పోల్ నుంచి వైర్ తెగి నీటిలో పడింది. దీంతో బీఆర్ తండా, వ్యవసాయ బావులకు, సెల్ టవర్‌కు నిన్నటి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఊరచెరువు నిండి మత్తడి పోస్తుండగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కష్టంగా మారింది. దీంతో ఎలాగైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలన్న లక్ష్యంతో.. శుక్రవారం సాయంత్రం చెరువులో చేపలు పట్టే తెప్పను తెచ్చి అనుభవం లేకున్నా విద్యుత్తు రిపేరు పరికరాలతో సహా తెప్పపై ప్రయాణించి 11 కేవీ వైర్‌ను పోల్‌పై అమర్చారు. దీంతో బీఆర్ తండాకు, వ్యవసాయ బావులకు కరెంటు సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఈ టాస్క్‌లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ జావిద్, ఎల్ఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.