అక్కన్నపేట, నవంబర్ 15: ప్రభుత్వం చెప్తున్న ఇండస్ట్ట్రియల్ పార్కుకు భూములిచ్చే సమస్యే లేదని సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన సర్వే నంబర్ 312 బాధిత రైతులు మరోమారు తేల్చిచెప్పారు. గురువారం చౌటపల్లి స్టేజీ వద్ద ధర్నా చేసిన రైతులు శుక్రవారం అక్కన్నపేట మండలంలోని జనగామ, చౌటపల్లి, తోటపల్లి గ్రామాల్లోని రైతులు, గ్రామస్థులు చౌటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. విషయం తెలుసుకొని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్ హుటాహుటిన పోలీస్ సిబ్బందితో అక్కడికి
చేరుకున్నారు. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని రైతుల నుంచి వివరాలు సేకరించారు. గొడవలు సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిన తర్వాత రైతులు సమావేశాన్ని కొనసాగించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని తీ ర్మానం చేసుకున్నారని, సమష్టిగా ఉంటూ శాంతియుతంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయమై స్థానిక కాంగ్రెస్ ముఖ్యనాయకులతో మరోసారి చర్చించి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయకుండా ప్రయత్నాలు చేయాలని మంత్రిని కోరాలని రైతులు నిర్ణయించినట్టు తెలిసింది.