హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్లలో స్థానిక రిజర్వేషన్లు అమలుచేసిన సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ లోకల్ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. ఎన్నో ఏండ్లుగా మోసపోతున్న తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం గురువారం రెండు జీవోలు జారీ చేసి న్యాయం చేసిందని పేర్కొన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావును కలిసి శాలువా కప్పి, సత్కరించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావుకు, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయంతో సుమారు వెయ్యికిపైగా విద్యార్థులు ఏటా డాక్టర్లు అయ్యే అవకాశం లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్, ముఖ్యసలహాదారు చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.