హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘మహాత్మా ఫూలే, నారాయణగురు, పెరియార్ వంటి మహనీయుల కృషి వల్లే నేడు సామాన్యులకు గుర్తింపు వచ్చింది. వారి స్ఫూర్తితోనే నేడు రిజర్వేషన్ల ప్రక్రియ అమలవుతుంది. అసమానతలు తొలిగి పోవాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా, సమానత్వం రావాలన్నా.. అది ఒక్క రిజర్వేషన్ల వల్లే సాధ్యం అవుతుంది’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో నిర్వహించిన నారాయణగురు శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు, పేదల బాగు కోసం నారాయణగురు పరితపించారని కొనియాడారు. సమాజంలో తలెత్తిన అనేక అసమానతలను తొలిగించి, మనుషులంతా ఒక్కటేనని ఆయన చాటారని తెలిపారు. స్వా తంత్య్రం వచ్చిన ఇన్నేండ్ల తర్వాత దేశంలో కులగణనకు మోక్షం లభించిందని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్యుమరేషన్ ప్రక్రియ జరుగుతుందని, శాస్త్రీయ పద్ధతిన కులగణన చేసి, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
42శాతం రిజర్వేషన్లకు కట్టుబడాలి
తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కూడా కులగణన చేశారని, రిజర్వేషన్ అసంబద్ధంగా, చట్టసవరణ జరగకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక కులగణనలో, తెలంగాణలో చేసిన తప్పులు చేయకుండా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీకే హరిప్రసాద్, ఎమ్మెల్సీ జగదేవ్ గుత్తేదార్, అశోక్ గుత్తేదార్, ప్రణవానంద స్వామిజీ, నితిన్ గుత్తేదార్, బాలరాజు గుత్తేదార్, వినయ్ గుత్తేదార్, సదానంద పార్ల పాల్గొన్నారు.