అచ్చంపేట రూరల్, మార్చి 14 : ఎస్ఎల్బీసీలో సొరంగంలో ఏడుగురు కార్మికులు గల్లంతై 21 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతోపాటు ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ వెల్లడించారు. బురదమట్టిని త్వరగా తొలగించేందుకు 30 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ వాక్యూమ్ పంపు, ట్యాంక్‌తో కూడిన మెషిన్‌ను సొరంగంలోకి పంపినట్టు తెలిపారు.
మ్యానువల్ డిగ్గింగ్‌కు బదులుగా అటనమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను వినియోగిస్తున్నామని, ఇది గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదమట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలిస్తున్నదని వివరించారు. సహాయక చర్యల్లో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డీపీవో ఫిరంగి, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైడ్రా, అన్వీ రోబోటిక్, దక్షిణ మధ్య రైల్వే బృందం సభ్యులు పాల్గొంటున్నారు. కాగా, సహాయ చర్యలపై ఉన్నతాధికారులు చెప్తున్న మాటలకు, సొరంగం లోపల జరుగుతున్న పనులకు మధ్య పొంతన కనిపించడం లేదు. దీంతో శిథిలాల తొలగింపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. గల్లంతైన కార్మికుల ఆనవాళ్లను గుర్తించడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించడం లేదని, బాధిత కుటుంబసభ్యుల రోదనలను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.