హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు ఉల్లంఘించడంపై సొనెస్టా ఇన్ఫినిటీ, హస్తిన రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు రెరా అధికారులు తెలిపారు. సొనెస్టా ఇన్ఫినిటీ ప్రమోటర్స్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనక ఉన్న జయభేరి పైన్ కాలనీలో ైస్కె విల్లాస్ నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. హస్తిన రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ బ్రిస్సా ప్రాజెక్టు పేరుతో శ్రీశైలం హైవే సమీపంలో కడ్తాల్ టౌన్ ఫార్మా సిటీ వద్ద రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారాలు నిర్వహించడంతో షోకాజ్ నోటీసులు జారీచేసి వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించినట్టు వెల్లడించారు. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఇండ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయాలని, ప్రీలాంచ్ ఆఫర్లు అంటూ మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని కోరారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన రియల్టర్స్, భవన నిర్మాణదారులపై వాట్సాప్ నంబర్ 90000 06301, ఫోన్ 040-2939 4972లతో పాటు rera- maud@ telangana.gov.in, secy-rera-maud@telangana.gov.in e- mail ID లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.