ఈ చిత్రంలోని కార్మికుడి పేరు పులి మనోజ్. వీరు నలుగురు అన్నదమ్ములు. అందరూ నేతకార్మికులే. కేసీఆర్ సర్కార్ హయాంలో నేతన్నలకు చేతినిండా పని కల్పించేందుకు ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారు. 2020లో వీరి కుటుంబసభ్యులు కలిసి తన తల్లి పేరిట పద్మావతి టెక్స్టైల్ (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ) యూనిట్ పెట్టుకున్నారు. సొంత జాగలో 25 మరమగ్గాలతో కూడిన కార్ఖానా ఏర్పాటు చేసుకున్నారు. మూడు 15 హెచ్‌పీ మోటర్లు తల్లి పద్మావతి, ఇద్దరు సోదరులు రవికిరణ్, దేవదాస్ పేరిట ఏర్పాటు చేసుకుని కార్ఖానాను నడిపించుకున్నారు. వీరికి యూనిట్ రూ.4.50 ఉండగా, 50శాతం సబ్సిడీతో యూనిట్‌కు రూ.2.25 చొప్పున కరెంట్ బిల్లు కట్టేవారు. ప్రతినెలా బిల్లు రూ.10 వేలలోపు వచ్చేది. సాఫీగా సాగుతున్న తరుణంలో ఎస్ఎస్ ఐ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ వర్తించదని, కోర్టు ఆదేశాలు వచ్చాయని సెస్ అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో నెలకు రూ.10 వేలలోపు బిల్లులు వచ్చిన కార్ఖానాకు రూ.35 వేల వరకు రావడంతో 2023లోనే కార్ఖానా మూసివేశారు. ఈ బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీలతో కలిసి ఇప్పుడు కార్ఖానాకు రూ.13 లక్షల వరకు బకాయిలు పేరుకుపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే దుబాయ్ వెళ్లి, అక్కడా పనిలేక ఆరు నెలల్లోనే ఇంటికి వచ్చినట్టు మనోజ్ ఆవేదన వ్యక్తంచేశారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రెండున్నరేండ్లుగా కళతప్పింది. కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపుతో విద్యుత్తు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై రూ.38 కోట్ల బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీల భారం వేయడంతో అనేక యూనిట్లు మూతపడి కార్మికులకు పనిలేకుండాపోయింది. ఈ క్రమంలో దాదాపు 15 మంది ఆత్మహత్యలు చేసుకోగా, మరెంతో మంది బతుకులు ఆగమయ్యాయి. ఇటీవల ఈ సమస్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వానికి విన్నవించడంతో నేత కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు జీవం పోసింది. కార్మికులకు అన్ని రకాలుగా అండగా నిలిచింది. ఏటా కోటి బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను టెస్కో ద్వారా ఇచ్చింది. వీటితోపాటు ప్రభుత్వ ఆర్డర్లను కూడా అందజేసింది. దీంతో నేతన్నలకు చేతినిండా పని, పనికి తగిన వేతనంతో సంతోషంగా ఉన్నారు. వస్త్ర పరిశ్రమంలో 127 ఎస్ఎస్ఐ (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్) పవర్లూమ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వ వస్ర్తాలు, చీరల తయారీని కొనసాగించారు.
తెలంగాణ రాక ముందు వరకు ఉన్న 50 శాతం విద్యుత్తు సబ్సిడీని కేసీఆర్ సర్కార్ 10 హెచ్‌పీ నుంచి 25 హెచ్‌పీల వరకు అనుమతి ఇవ్వడంతో వస్త్ర పరిశ్రమలో మరమగ్గాలు జోరందుకొని, వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎస్ఎస్ఐ యూనిట్లకు విద్యుత్తు సబ్సిడీ ఇవ్వరాదని, ఓ వ్యక్తి కోర్టులో కేసు వేస్తే 2025లో తీర్పు రావడంతో ఎస్ఎస్ఐ యూనిట్లకు సెస్ అధికారులు బ్యాక్ బిల్లింగ్ కలిపి బిల్లులు వేశారు. రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీలతో కలిపి ఇప్పుడు రూ.38 కోట్లకు చేరడంతో భారంగా మారింది. 50 శాతం సబ్సిడీ వర్తించకపోవడం, బ్యాక్ బిల్లింగ్‌తో భారీగా బిల్లులు రావడంతో పలు ఎస్ఎస్ఐ యూనిట్లను మూసివేశారు. మరికొందరు భయంతో మరమగ్గాలను అమ్ముకున్నారు. వస్త్ర పరిశ్రమ కరెంట్ సంక్షోభంలో మునిగిపోగా, భారీ బకాయిలు చెల్లించలేక, పరిశ్రమలు మూత పడటంతో ఉపాధి లేక 15 మంది నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పవర్‌లూమ్స్‌కు 50 శాతం సబ్సిడీ వర్తించకపోవడంతో 127 ఎస్ఎస్ఐ యూనిట్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. 2023-24 కాలంలో సగం యూనిట్లను మూసివేశారు. పలువురు నిర్వాహకులు మరమగ్గాలను విక్రయించారు. మరికొందరు తుక్కు కింద అమ్ముకున్నారు. ప్రభుత్వం మారడం తో ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరల త యారీ ఆర్డర్లు సైతం రాకపోవడంతో మరిం త భయాందోళనకు గురయ్యారు. పనిలేక, ఆర్థిక ఇబ్బందులతో సుమారు 13 మందికిపైగా నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించి 2023 వరకు వినియోగించిన విద్యుత్తుకు బ్యాక్ బిల్లింగ్ సుమారు రూ.19 కోట్లు ఉన్నట్టు సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్) తేల్చింది. ఈ బిల్లులు ప్రతినెలా 18 శాతం సర్‌చార్జీల రూపంతో పెరుగుతూ వస్తున్నది. ఇప్పటివరకు మొత్తం రూ.38 కోట్లకు చేరింది. దీంతో కొందరు పెండింగ్ బిల్లులు చెల్లించలేక, కొత్త మీటర్లు ఏర్పాటు చేసుకొని, మరికొంత మంది సెస్ అధికారుల సూచనతో మినిమమ్ బిల్లులు చెల్లిస్తూ కొనసాగిస్తున్నారు. వీరంతా కలిసి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2025 జనవరి 29న క్యాటగిరీ-3లోనే బిల్లులు చెల్లించాలని తీర్పు వచ్చింది. దీంతో రాయితీ పొందుతున్న పవర్లూమ్ నిర్వాహకులు, యజమానులు ఆందోళన చెందారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విద్యుత్తు సంక్షోభంలో కూరుకుపోవడంతో పాటు అధికార పార్టీ నేతన్నలపై
వివక్ష చూపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న రూ.38 కోట్ల బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జీలను రద్దు చేయాలని, విద్యుత్తు సంక్షోభంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేత కార్మికులను కాపాడాలని రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్తు బకాయిలు, సర్ చార్జీల భారానికి సంబంధించి సమగ్ర వివరాలతో వినతిపత్రాన్ని అందజేశారు. బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు విద్యుత్తు సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు తిరిగి ఆత్మహత్యలబాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.