మక్తల్ : ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం ఉద్యోగులను ( Part-Time Employees ) యథావిధిగా విధుల్లో చేర్చుకోవాలని కోరుతూ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ( MLA Srihari ) సోమవారం పార్ట్ టైం ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్ట్ టైం ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్( President Eshwar ) మాట్లాడుతూ పది సంవత్సరాల నుంచి ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాలలో పార్ట్ టైం ఉద్యోగులుగా రకరకాల విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎలాంటి కారణం లేకుండా బాలికల స్కూళ్ల నుంచి తమను తొలగిస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల సెక్రటరీ అలుగు వర్షిని ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని వాపోయారు. బాలికల పాఠశాల, కళాశాలలో కేసీఆర్ పాలన సమయంలో విధులు నిర్వహిస్తూ, విద్యార్థులకు పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను చక్కటి రీతిలో తీర్చిదిద్దేందుకు నిరంతరం కష్టపడి పనిచేశామని వెల్లడించారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పార్ట్ టైం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ. 42 వేల వేతనం కల్పిస్తూ, మినిమం పే స్కేల్ జాబ్ సెక్యూరిటీ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఏర్పడి 18 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోక తమను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన వారిలో పార్ట్ టైం ఉద్యోగులు ప్రకాష్ రెడ్డి తో పాటు తదితరులున్నారు .