హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ రిజిస్ట్రార్ తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నది. తాజా గా యూనివర్సిటీ సహోద్యోగులపైనే హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఇటీవల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడులయ్యాయి. నోటిఫికేషన్ ఆంధ్రా అభ్యర్థులకు లబ్ధి చేకూరేలా ఉందనే ఆరోపణల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌ను అడ్డుకొనే అవకాశం ఉందని ఆరోపిస్తూ హార్టికల్చర్ విభాగం డీన్‌తోపాటు 13 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెం ట్ ప్రొఫెసర్లపై రిజిస్ట్రార్ కేవియట్ దాఖలు చేశారు. ఇందులో యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్‌ను కూడా చేర్చారు. ఈ విషయం ఇప్పుడు యూనివర్సిటీ సర్కిల్స్‌లో వివాదాస్పదంగా మారింది. ఒక సంస్థకు చెందిన ఉద్యోగులపై అదే సంస్థకు చెందిన ఉన్నతాధికారి కేవియట్ వేయడం ఎన్నడూ లేదని అంటున్నారు. రిజిస్ట్రార్ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారనే అక్కసుతోనే కేవియట్‌లో చేర్చినట్టు తెలుస్తున్నది. దీనిపై వైస్‌చాన్సలర్ నిమ్మకు నీరెత్తకుండా ఉండటంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగఖాళీలకు సంబంధించి డీన్ ఇచ్చిన వివరాలను వీసీ, రిజిస్ట్రార్ ప్రభుత్వానికి ప్రతిపాదించి అనుమతులు వచ్చాక ధ్రువీకరించి నోటిఫికేషన్‌కు ఆమోదం తెలుపుతారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీలో మాత్రం విచిత్రంగా నోటిఫికేషన్ వెలువడటానికి కీలకంగా వ్యవహరించిన డీన్నే అడ్డుకుంటారని ఆరోపిస్తూ కేవియట్ వేయడం ఆశ్చర్యం. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను అప్పటికే ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారు అడ్డకుంటారంటూ వారి పేర్లను పేర్కొనడం మరింత విడ్డూరం. విస్తుపోయే విషయమేంటంటే పీజీ స్థాయి ఉద్యోగిని పేరు జాబితాలో చేర్చడం.
నోటిఫికేషన్ అడ్డుకుంటారని కేవియట్‌లో పేర్కొన్న ఉద్యోగులంతా తెలంగాణకు చెందినవారు కావడంతోనే ఆంధ్రాకు చెందిన రిజిస్ట్రార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ చర్య ముమ్మాటికీ పరువుకు భంగం కలిగించేలా ఉన్నదని, ఆయనపై తాము పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.