హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): భారత్‌లో తొలిసారి రక్షణ రంగానికి అవసరమైన అడ్వాన్స్డ్ జింబల్స్ (డేలైట్ అండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాల) తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్‌తో ఫ్రెంచ్ కంపెనీ ‘మరియో’ చేతులు కలిపింది. దీనిలో భాగంగా ‘మరియో’ సీఈవో రెమి ప్లానెట్ ఆధ్వర్యంలో రెండు సంస్థల ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశమై తమ కార్యకలాపాల గురించి వివరించారు. హైదరాబాద్‌లో అత్యాధునిక జింబల్స్ ఉత్పత్తిని చేపట్టడానికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు వీరు భారత రక్షణ రంగ సంస్థల ప్రముఖులను, ఉన్నతాధికారులను కలిశారు. అడ్వాన్స్డ్ జింబల్స్ను తయారు చేయాలన్న ప్రణాళికను వారితో పంచుకున్నారు. ప్రతినిధుల బృందంలో ‘మరియో’ టెక్నికల్ మేనేజర్ మాథ్యూ డిస్కోర్స్, సేల్స్ మేనేజర్ నియోమి లాన్సియెన్తోపాటు హెచ్‌సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిశోర్ తదితరులు ఉన్నారు.