బంజారాహిల్స్/కుత్బుల్లాపూర్/దుండిగల్, ఫిబ్రవరి 12: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి బుధవారం మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఎన్నికల సమయంలో మున్నూరుకాపులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా సీఎం ఇంటిముట్టడికి యత్నించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ నాయకత్వంలో సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ సమయంలో శ్రీనివాస్ పటేల్ సహా 10 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనలో మున్నూరు కాపుల జనాభాను తక్కువ చేసి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మున్నూరుకాపు ఫై నాన్స్ కార్పొరేషన్ కోసం తాము ఆందోళన చే స్తున్నప్పుడు మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మాత్రం నోరుమెదపడం లేదని ఆరోపించారు. మున్నూరుకాపు విద్యార్థి వసతి గృ హాన్ని ఎండోమెంట్ పరిధిలో నుంచి తొలగించాలని, మున్నూరుకాపుల పేరు చివర అందరికీ పటేల్ అని చేర్చేలా గెజిట్ విడుదల చేయాలని, స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పలువురి అరెస్టు
మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి తరలివెళ్తున్న ప్రతినిధులను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో మున్నూరుకాపు సంఘం నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ సర్కారు మున్నూరుకాపులను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. 5,000 కోట్లతో మున్నూరుకాపు ఫైనా న్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మున్నూరుకాపులకు మంత్రి పదవి ఇవ్వాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమా్‌ండ చేశారు. లేనిపక్షంలో మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెడతామని హెచ్చరించారు.