హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితుల తుది నివేదికను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావుకు ఫైవ్‌మెన్ కమిటీ ఆదివారం అందజేసింది. గురుకులాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్‌పాయిజన్ కేసులు, విద్యార్థుల ఆత్మహత్యలు తదితర అంశాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్వీ నాయకులు ‘గురుకుల బాట’ చేపట్టిన విషయం తెలిసిందే. ఫైవ్‌మన్ కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను సందర్శించారు.
సంక్షేమ, వసతిగృహాల్లోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా అంశాలపై కమిటీ సభ్యులు ప్రత్యేకంగా నివేదిక రూపొందించారు. ఎర్రవెల్లిలో కేసీఆర్‌ను కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సభ్యులు బాల సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఆంజనేయగౌడ్ కలిసి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా నివేదికలో ఉన్న గురుకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, సతీశ్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నయీంనగర్, డిసెంబర్ 8 : హనుమకొండ జిల్లా శాయంపేట దొనగుట్ట (త్రివేదాద్రి)పై తొలిసారిగా నవీన శిలాయుగానికి చెందిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర పరిశోధకుడు, డిసవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి, పాతూరి రఘురామయ్యతో కలిసి శాయంపేట గుట్టలను సందర్శించి పలు వివరాలను వెల్లడించారు. గుట్టపై శ్రీసంతోషలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెనుక వైపు సమతల ప్రాంతంలో నవీన శిలాయుగపు (గ్రూప్స్) ఆధారాలు ఉన్నాయని తెలిపారు. సుమారు ఐదువేల ఏండ్ల కిందట మానవులు ఇకడ రాతి పరికరాలను తయారు చేసుకునేవారని తెలిపారు.