హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం పనిచేసే కార్పొరేషన్లకు సర్కారు తిలోదకాలు ఇచ్చేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సంస్థల పనితీరు, లాభనష్టాలను సాకుగా చూపిస్తూ మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నదని రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్ష సమావేశం సాగినతీరు ఇందుకు బలం చేకూర్చుతున్నదని చెప్తున్నారు. సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లపై నివేదికలు ఇవ్వాలని ఆయా సంస్థల ఎండీలను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తే కార్పొరేషన్ల మనుగడ కొనసాగుతుందని మంత్రి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయాన్ని నిర్వీర్యానికి కుట్రలు పన్నుతున్నదని రైతు సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు.