JL Recruitment | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగం వారి కల. 14 ఏండ్ల తర్వాత జేఎల్ నోటిఫికేషన్ వెలువడటంతో సంతోషపడ్డారు. గెజిటెడ్ ఉద్యోగం కావడంతో అహోరాత్రులు శ్రమించారు. మం చి ప్రతిభ కనబరిచి ఎట్టకేలకు ఉద్యోగం సా ధించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే చేతికందాల్సి ఉంది. కానీ ఎడతెగని తాత్సారం.. ఎదురుచూపులు. దీనికంతటికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం లేకపోవడమే. దీంతో రాష్ట్రంలో జేఎల్ అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీ నిలిచిపోయింది.
రాష్ట్రంలో 2008 తర్వాత మళ్లీ 2022లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. కేసీఆర్ సర్కారు చొరవతో 23 సబ్జెక్టులకు 1,392 పోస్టుల భర్తీకి టీజీపీస్సీ 2022 డిసెంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్య చరిత్రలో ఒకేసారి 1,300కు పైగా పోస్టులను భర్తీచేయడం ఇదే తొలిసారి. 2023 సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించి, 2024 జూన్ 8న జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించారు. డిసెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఇ ప్పుడు కేవలం నియామకపత్రాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. రిక్రూట్మెంట్ బాధ్యతలను టీజీపీఎస్సీకి అప్పగించారు.
టీజీపీఎస్సీ ప్రక్రియనంతా పూర్తిచేసి ఇంటర్ విద్య కమిషనరేట్‌కు అప్పగించింది. ఇంటర్ విద్య కమిషనరేట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం కోరింది. సీఎం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్డర్ల జారీలో జాప్యం జరుగుతున్నది. సీఎం ఈ విషయంపై చొరవ చూపి నియామకపత్రాలివ్వాలంటూ జేఎల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 1,392 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, వీటిలో కోర్టు కేసులతో 253 పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఇవి ఇంగ్లిష్, బోటనీ సబ్జెక్టుల పోస్టులు కావడం గమనార్హం. మల్టీ జోన్-1లో 581, మల్టీజోన్-2లో 558 చొప్పున 1,139 జేఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది.