ఇల్లందకుంట సెప్టెంబర్ 15: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వాగొడ్డురామన్నపల్లి, మల్యాల, కనగర్తి, లక్ష్మాజీపల్లి గ్రామాల రైతులకు సాగు నీరందించే వెంకటేశ్వర నాలాకు ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడింది. దీనికి మరమ్మతులు చేసేందుకు అధికారులెవ్వరూ ముందుకు రాకపోవడంతో రైతులే శ్రమదానం చేసి గండిని పూడ్చారు. వివరాల్లోకి వెళ్తే.. వాగొడ్డురామన్నపల్లి వద్ద గతంలో స్థానిక వాగుపై వెంకటేశ్వర నాలా నిర్మించారు. దీని కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవలి వర్షాలకు నాలాకు గండి పడింది. దీంతో ఆయకట్టు కింద నీరు లేక పొలాలు ఎండిపోవడంతో రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోకపోవడంతో పంటలను బతికించుకోవడానికి మూడు గ్రామాలకు చెందిన 50 మంది రైతులు శ్రమదానం చేసి తాత్కాలికంగా గండిని పూడ్చారు. నాలా గండిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చేయాలని అయా గ్రామాల రైతులు కోరుతున్నారు.