ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని తామంతా కోరామని, దీనిపై స్పష్టత వచ్చేంత వరకు ఇక్కడ ఎవరి అభ్యర్థిత్వాలపై చర్చలు జరగబోవని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ పోటీ చేయకపోతే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి తానే బరిలోకి దిగుతానని చెప్పారు. తనను కాదనే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్లో టీడీపీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. హిందూత్వ పునాదులపై రాజకీయాలు నడపాలనుకుంటున్న వారి ఆటలు భవిష్యత్లో సాగబోవని బీజేపీని రేణుకాచౌదరి హెచ్చరించారు.