Ravva Srihari | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): సుప్రసిద్ధ తెలుగు, సంస్కృత సాహితీవేత్త, పుంభావ సరస్వతి, ఈ కాలం వాల్మీకి అనదగ్గ ఆచార్య రవ్వా శ్రీహరి (80) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామం. నిరుపేద పద్మశాలి కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి తెలుగు,సంస్కృత సాహితీ దిగ్గజాల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్ సహా ఎందరో సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
తెలంగాణ మట్టిలో మెరుగుపెట్టిన మాణిక్యం రవ్వా శ్రీహరి. సంస్కృతాంధ్ర భాషలను కరతలామలకం చేసుకున్న పుంభావ సరస్వతి ఆయన. జీవితమంతా ఉభయభాషా సాహితీ వనంలో ఎన్నెన్నో కావ్య కుసుమాలను పూయించిన విద్వత్ కలం కాలపరీక్షను స్వీకరించి ఆగిపోయింది. సాహితీమూర్తిగా, అధ్యాపకుడిగా, రీడర్‌గా, ఆచార్యుడిగా, ఉప కులపతిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. ఆయన రచనల్లో సంస్కృతానికి భాష్యం చెప్పారు. తెలుగు భాషకు వన్నె తెచ్చారు. తెలంగాణ యాసకు పట్టం కట్టారు. తెలుగుజాతి మహామహోపాధ్యాయగా సగర్వంగా పిలుచుకునే ఆచార్య రవ్వా శ్రీహరి సామాన్య చేనేత కుటుంబంలో జన్మించి.. అసామాన్య ప్రజ్ఞ సముపార్జించి.. లబ్ధప్రతిష్ఠుడు అనిపించుకొని.. పండితవరేణ్యుల సందేహాలు నివృత్తి చేసే స్థాయికి చేరుకున్నారు. తెలుగు జాతికి ప్రాతఃస్మరణీయుడిగా తరగని కీర్తిని పొందారు.
ఇటు తెలుగు, అటు సంస్కృతం.. ఈ రెండు భాషల జోడుగుర్రాలపై సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో 1943 సెప్టెంబర్ 7న జన్మించారు. ఆయనకు భార్య అనంత లక్ష్మి, ముగ్గురు కుమారులు రమేశ్, శివకుమార్, పతంజలి ఉన్నారు. కొడుకులు అమెరికాలో నివసిస్తున్నారు. ఈ సాహితీ విద్వన్మణి అంత్యక్రియలు ఆదివారం ఉదయం పది గంటలకు అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
శ్రీహరి తల్లిదండ్రులు వెంకటనర్సమ్మ, నర్సయ్య. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో యాదగిరిగుట్ట సంస్కృత విద్యాపీఠంలో ఉచిత భోజనంతో విద్యాబోధన ఉంటుందని తెలిసి ఆ తలుపు తట్టారు. అక్కడే సంస్కృతంపై పట్టుసాధించారు. తర్వాత హైదరాబాద్ సీతారాంబాగ్‌లోని మున్నాలాల్ సంస్కృత కళాశాలలో డీవోఎల్, బీవోఎల్ పూర్తిచేశారు. అక్కడ శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం అభ్యసించారు. తర్వాత వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడిగా చేరారు. 1967లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం ఏ సంస్కృతం ప్రైవేట్‌గా చదివి స్వర్ణ పతకం సాధించారు. ప్రైవేట్‌గానే ఎం ఏ తెలుగు చదివారు.
‘భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలనం’ అనే అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఉద్యోగ ప్రస్థానంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో సంస్కృతాంధ్ర ఉపన్యాసకులుగా కొన్నాళ్లు పనిచేశారు. నిజాం కళాశాల, ఆర్ట్స్ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా, రీడర్‌గా, ఆచార్యుడిగా, తెలుగు శాఖ అధిపతిగా సేవలు అందించారు. దాదాపు 43 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఎందరో శిష్యులను భాషా పండితులుగా తీర్చిదిద్దారు. తర్వాత కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలు అందించారు. పదవీ విరమణ పొందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకుడిగా సాహితీ విస్తరణకు తనవంతు సాయం అందించారు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ‘మహామహోపాధ్యాయ’ అన్న బిరుదుతో ఆయనను సత్కరించింది.
సంస్కృత కావ్యాలను తెనుగీకరించడం వాడుకలో ఉన్న సంప్రదాయం. దానికి భిన్నంగా తెలుగు కావ్యాలను సంస్కృతంలోకి అనువదించి ఉభయ భాషల్లో తన పటిమను ఎన్నోసార్లు నిరూపించుకున్నారు శ్రీహరి. పదిహేడేండ్ల వయసులో మొదటగా కాళహస్తీశ్వర శతకంలోని పది పద్యాలను సంస్కృతంలోకి అనువదించారు. ఆ తర్వాత ఆయన సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ తనదైన ముద్రవేశారు. మాతృభాషకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో మహా నిఘంటువు రచన చేపట్టారు. ‘శ్రీహరి నిఘంటువు’గా తీసుకొచ్చిన ఈ గ్రంథంలో అప్పటి వరకు ఏ నిఘంటువులోనూ చోటుదక్కని 13వేల అచ్చతెలుగు పదాలను సేకరించి, వాటికి అర్థాలను వివరించారు. మాండలిక పదాలకూ ఇందులో చోటిచ్చారు. తెలంగాణ మాండలికాలు- కావ్యప్రయోగాలు, నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం తదితర గ్రంథాలు రచించారు.
మాతృగీతం, సంస్కృత వైజయంతి వంటి సంస్కృత రచనలు పండిత ప్రకాండుల మెప్పుపొందినవి. ఎన్నెన్నో తెలుగు కావ్యాలను సంస్కృతంలోకి అనువదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సీ నారాయణరెడ్డి రచన ‘ప్రపంచ పదులు’ కావ్యాన్ని ‘ప్రపంచ పది’ పేరుతో అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. గుర్రం జాషువా ఫిరదౌసి, గబ్బిలం కావ్యాలనూ సంస్కృతంలోకి అనువదించారు. వేమన పద్యాలను, నరసింహ శతకాలనూ సంస్కృతంలో తిరగ రాశారు. టీటీడీలో పనిచేసే రోజుల్లో అన్నమయ్య సాహిత్యంపై అవిశ్రాంతంగా పరిశోధన చేశారు. ‘అన్నమయ్య పదకోశం’, ‘అన్నమయ్య సూక్తి వైభవం’, ‘అన్నమయ్య భాషా వైభవం’, ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ వంటి పలు గ్రంథాలు రచించి తొలి తెలుగు వాగ్గేయకారుడికి తగిన రీతిన నివాళులు అర్పించారు శ్రీహరి. యాభైకి పైగా తెలుగు గ్రంథాలు, 25కు పైగా సంస్కృత గ్రంథాలు రచించి ఉభయ భాషా ప్రవీణుడిగా ఉన్నత కీర్తిని సముపార్జించారు. దుర్భర దారిద్య్రంలో ఉన్నా.. శేఖరీభూతమైన విద్వత్ సంపద ఆ సరస్వతీ పుత్రుడికి వివిధ పదవులను కట్టబెట్టి అందలాన్ని ఎక్కించింది. 2013లో సీపీ బ్రౌన్ పురసారంతోపాటు ఏపీ అధికార భాషా సంఘం విశిష్ట పురసారం కూడా ఆయన్ని వరించింది. 2014లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం గిడుగు రామ్మూర్తి పురసారం అందించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): సుప్రసిద్ధ సాహితీవేత్త, ప్రముఖ తెలుగు, సంసృత భాషా పండితుడు, ఆచార్య రవ్వా శ్రీహరి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రవ్వా శ్రీహరి సామాన్య కుటుంబంలో జన్మించి, తన కృషి పట్టుదలతో భాషా సాహిత్యరంగంలో అంచలంచెలుగా ఎదిగారని సీఎం గుర్తు చేసుకున్నారు. లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, వైస్‌చాన్స్‌లర్‌గా పలు పదవులు చేపట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన రవ్వా శ్రీహరి జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. వారి మరణం, భాషా సాహిత్యరంగాలకు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. శోకతప్తహృదయులైనవారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బహుజన వర్గాల నుంచి వచ్చిన ఈ కాలం వాల్మీకి ఆచార్య రవ్వా శ్రీహరి. సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చి తెలుగు సాహిత్యంలో మహోన్నత శిఖరంగా ఎదిగిన శ్రీహరి మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది. తెలుగు సంసృత భాషల్లో ఇంతగా పాండిత్యాన్ని సంపాదించినవారు, విరివిగా రచనలు చేసినవారు, తెలుగు సంసృత భాషలకు ఇంత సేవ చేసిన వ్యక్తి ఈ కాలంలో మరొకరు లేరు. తెలంగాణ ప్రాంతంలో పోతన, కాళోజీ నారాయణరావుల తర్వాత మళ్లీ అంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి రవ్వా శ్రీహరి. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి పూడ్చలేని లోటు.
-జూలూరు గౌరీశంకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
తెలుగు భాషా నిఘంటు నిర్మాత, సంకీర్తనాచార్యులు అన్నమాచార్య కీర్తనలపై అపార పరిశోధనలు చేసిన ఆచార్య రవ్వా శ్రీహరి మృతి విద్వత్లోకానికి తీరని లోటని డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. సమకాలీన సాహిత్యంలో రవ్వా శ్రీహరి వంటి బహుభాషావేత్త మరొకరు లేరని,సంస్కృత భాష పెద్ద దిక్కు కోల్పోయిందని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం గౌరవ కార్యదర్శి ఉడయవర్లు తెలిపారు. శ్రీహరి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. పరిశోదన, సృజన, విమర్శ, అనువాదం, వ్యాకరణం, నిఘంటు నిర్మాణ రంగాలలో శ్రీహరి చేసిన కృషి అనిర్వచనీయమని తెలుగు వర్సిటీ వీసీ కిషన్‌రావు చెప్పారు.
రవ్వా శ్రీహరి తనకు బాల్యమిత్రుడని, అతని మరణం సాహితీలోకానికి తీరని లోటని ప్రముఖ కవి, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తెలిపారు. ఆచార్య రవ్వా శ్రీహరి మృతికి తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పరిషత్తులోని ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన ఆయన పరిషత్తుకు ప్రధాన కార్యదర్శిగా శ్రీహరి దీర్ఘకాలం పనిచేసి విశిష్టసేవలందించారని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. వీరితో పాటు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు పిల్లలమర్రి రాములు, డాక్టర్ రవ్వా వెంకటేశ్వర్ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.