హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తీవ్రమైన తప్పేదో జరుగుతున్నదని ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ సతీశ్ ఆచార్య అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం స్పందించారు. ‘రాజ్యం/ప్రభుత్వం/అధికార యంత్రాంగం ఎక్కడైనా ఇన్చార్జిగా ఎవరున్నారనే నిమిత్తం లేకుండా ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ఇది దురదృష్టకరం’ అని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళనను కవరేజ్ చేయడానికి ‘ది సౌత్‌ఫస్ట్’కు చెందిన జర్నలిస్ట్ సుమిత్ఝా వెళ్లారు. కానీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని ‘ది సౌత్‌ఫస్ట్’ ఎడిటర్ అనూష రవిసూద్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు సొంతపార్టీ నుంచి కార్తి చిదంబరం కూడా తప్పుబట్టారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.